- సరిహద్దులను డిజిటలైజ్చేయాలని బల్దియా కమిషనర్ ఆదేశం
- అడిషనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్‌తో సమీక్ష
హైదరాబాద్ సిటీ, వెలుగు: కాలనీల్లోని లేఅవుట్లు, పార్కులు, ఖాళీ స్థలాల సరిహద్దులను చీఫ్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ విభాగం సమన్వయంతో డిజిటలైజ్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి ఆదేశించారు. బుధవారం బల్దియా హెడ్డాఫీసులో అడిషనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ తో సమీక్ష నిర్వహించారు. ఖాళీ జాగాలతోపాటు పార్కుల సరిహద్దులను డిజిటలైజ్ చేసి జియో ఫెన్సింగ్ చేయాలని చెప్పారు. ప్రతి ట్రీ పార్కుకు, ఖాళీ స్థలాలకు స్పెషల్ఐడీ ఇవ్వాలన్నారు. 2 వేల చదరపు గజాల కంటే ఎక్కువగా ఉన్న ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. పార్కు ప్రాంగణంలో అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని, ఉల్లంఘనలు గుర్తిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అన్ని సర్కిళ్ల మేనేజర్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్లు తమ పరిధిలోని పార్కులను కనీసం నెలకు ఒకసారైనా సందర్శించాలని, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి పార్క్ తనిఖీ రిపోర్టును 5వ తేదీలోపు అర్బన్ బయోడైవర్సిటీ అడిషనల్కమిషనర్ కు సమర్పించాలని ఆదేశించారు. వాకర్స్, స్టేక్ హోల్డర్స్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్సభ్యుల అభిప్రాయం ఆధారంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెలించవచ్చన్నారు. పార్కుల్లో ప్లాస్టిక్‌ను నిరోధించడానికి ఒక ప్రతిపాదనను సమర్పించాలన్నారు. సెక్యూరిటీ గార్డుల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ సుభద్రదేవి, శ్రీనివాసరావు, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ సునంద రాణి, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, విజిలెన్స్ విభాగం అడిషనల్ పోలీస్సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.