ఇకపై సర్కిల్ ఆఫీసుల్లోనూ ప్రజావాణి: జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి

ఇకపై సర్కిల్ ఆఫీసుల్లోనూ ప్రజావాణి: జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇకపై సర్కిల్ స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి వెల్లడించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్​లో సోమవారం ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటివరకు హెడ్డాఫీసు, జోన్ ఆఫీసుల్లో ప్రజావాణిలో నిర్వహిస్తుండగా, త్వరలో సర్కిల్ ఆఫీసుల్లోనూ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రజావాణిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికే ఫిర్యాదులు అందుతున్నాయని, 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 330 ఫిర్యాదులు అందగా, 190 పరిష్కరించినట్లు తెలిపారు. సోమవారం హెడ్డాఫీసు ప్రజావాణిలో 59  ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్​కు 34, ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ 6, ట్యాక్స్, వెటర్నరీ విభాగాలకు 3 చొప్పున, ఫైనాన్స్, హెల్త్, ఎలక్ట్రికల్ విభాగాలకు రెండు చొప్పున, శానిటేషన్, లేక్స్, యూసీడీ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. ఫోన్ ఇన్ ద్వారా 4 ఫిర్యాదులు వచ్చాయి. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 96 అర్జీలు అందినట్లు కమిషనర్ వివరించారు. 

అల్లు అర్జున్​ మామ ఫిర్యాదు 

సినీ నటుడు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటి స్థలం కోసం జీహెచ్ఎంసీ ప్రజావాణికి వచ్చారు. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్తరణలో తన ఇల్లు ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్ కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్లు కదిరవన్ పలాని, ముకుంద రెడ్డి  ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సోమవారం1,561 దరఖాస్తులు అందగా, అందులో సివిల్ సప్లైకు 743, గృహ నిర్మాణ శాఖకు 735, పెన్షన్ 55 ,  డీఈఓ 04 ఇతర శాఖలకు సంబంధించినవి 24 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. 
ఇబ్రహీంపట్నం: ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొంగరకలాన్ లోని కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ సంగీతతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. మొత్తం 67 ఫిర్యాదులు రాగా, రెవెన్యూ శాఖకు 35 , విద్యుత్ శాఖ - 04, పీడీ హౌసింగ్ 10, సర్వే లాండ్ 4, మెప్మా  3, విద్యాశాఖ 5, డీపీఓ -2, డీఆర్డీఓ కు -4 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. 

చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట జోనల్ ఆఫీస్​ ప్రజావాణిలో జోనల్ కమిషనర్ వెంకన్నకు చార్మినార్ సర్కిల్ పరిధిలోని ఫోకస్ హైస్కూల్  విద్యార్థులు కుక్కల బెడదపై  ఫిర్యాదు చేశారు. కుక్కల నుంచి తమను కాపాడాలని కోరారు.