టౌన్​ ప్లానింగ్​పై కమిషనర్​ ఫైర్.. న్యాక్​ ఇంజినీర్లపై వేటు?

టౌన్​ ప్లానింగ్​పై కమిషనర్​ ఫైర్.. న్యాక్​ ఇంజినీర్లపై వేటు?
  • 15 మంది అవినీతికి పాల్పడ్డట్టు ఫిర్యాదులు 
  • విజిలెన్స్​విచారణలోనూ అక్రమాలకు పాల్పడ్డట్టు రిపోర్టు​
  • రెండు, మూడు రోజుల్లో తొలగింపు!
  • అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ సైలెన్స్

హైదరాబద్ సిటీ, వెలుగు: టౌన్ ప్లానింగ్ అధికారులు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ర్టక్షన్(న్యాక్) ఇంజినీర్ల పనితీరుపై గురువారం టెలీకాన్ఫరెన్స్ లో బల్దియా కమిషనర్ ఇలంబరితి ఫైర్ అయ్యారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాము చెప్పినా టౌన్ ప్లానింగ్ వాళ్లు వినడంలేదని జోనల్ కమిషనర్లు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో క్రిమినల్​కేసులు పెట్టాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, న్యాక్​ఇంజినీర్లు డబ్బులు తీసుకుంటున్నట్టు తన దృష్టికి కూడా వచ్చిందని, కొందరి వీడియోలు కూడా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 న్యాక్ ఇంజినీర్లపై ఇటీవల విజిలెన్స్ విచారణ జరిపించగా, 80 శాతం మంది అవినీతికి పాల్పడుతున్నట్లు రిపోర్ట్​వచ్చిందన్నారు. కార్పొరేటర్ల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించిన కమిషనర్​రెండు మూడు రోజుల్లో 10 నుంచి -15 మంది నాక్ ఇంజినీర్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లపై కూడా చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. 

న్యాక్ ఇంజినీర్ల ఏం చేస్తారంటే ..

జీహెచ్ఎంసీలో నాక్ ఇంజినీర్లు టౌన్ ప్లానింగ్​తో పాటు ఇంజినీరింగ్, మెయింటెనెన్స్ పనులు, పనులకు సంబంధించిన మెజర్ మెంట్ బిల్స్ రాయడం చేస్తారు. బల్దియా చేపట్టే పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్​, రోడ్డు వైడెనింగ్, మెయింటెనెన్స్ పనులు పర్యవేక్షిస్తారు. భవన నిర్మాణాల్లో రూల్స్​పాటిస్తున్నారా లేదా చూడాలి. అక్రమ నిర్మాణాలకి సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఇవ్వాలి. కానీ, న్యాక్​ఇంజినీర్లు తమ పనులు చేయడం లేదు. పైగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. 

బల్దియాలో ఇంజినీర్లు తక్కువగా ఉండడంతో సపోర్ట్​గా ఉంటారని న్యాక్​ఇంజినీర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటే అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో న్యాక్​ఇంజినీర్లపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. కూకట్ పల్లి జోన్ లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు వారి దృష్టికి వచ్చింది. ఈ రిపోర్ట్​కొద్ది రోజుల్లో బల్దియాతో పాటు ప్రభుత్వానికి కూడా ఇవ్వనున్నట్టు సమాచారం.

స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉన్నా లేనట్లే..

బల్దియాలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు జోనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉన్నా లేనట్లుగానే ఉంది. ఈ టీమ్ లో ఇద్దరు న్యాక్​ఇంజినీర్లు, ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్​ఉంటారు. వీరికి జోనల్ కమిషనర్లు నాయకత్వం వహిస్తారు. అక్రమ నిర్మాణాలున్నట్టు న్యాక్​ఇంజినీర్లు గుర్తించి ఏఎంసీకీ రిపోర్ట్ చేయాలి.  కొన్నింటిపై రిపోర్ట్​ఇవ్వడం లేదు. రిపోర్టు ఇచ్చిన వాటిపై అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. దీంతో అక్రమ నిర్మాణాలను పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నాయి. 

అక్రమ నిర్మాణాలపై ప్రజావాణితో పాటు నేరుగా నెలకు 70 నుంచి 100 వరకు ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. విచారణ చేసినప్పుడు అక్రమ నిర్మాణాలు గుర్తించినా యాక్షన్​మాత్రం తీసుకోవడం లేదు. కొన్నింటికి నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.