
- కిందిస్థాయి ఆఫీసర్లకు ఫిర్యాదు ఇచ్చేందుకు నో ఇంట్రస్ట్
- బల్దియా కమిషనర్ కే ఫిర్యాదు ఇచ్చేందుకు జనాల వెయిటింగ్
- జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 194 ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 90 శాతం మంది తమ ఫిర్యాదులు కమిషనర్ఇలంబరితికే ఇచ్చారు. ప్రతి వారం బల్దియా హెడ్డాఫీసుకు వస్తున్న చాలామంది కింది స్థాయి ఆఫీసర్లకు తమ ఫిర్యాదులు ఇచ్చి వెళ్తున్నారు. అయినా పరిష్కారం కనబడకపోవడంతో కమిషనర్‌కే ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ సోమవారం కూడా అలాగే జరిగింది.
ఆలస్యంగా వచ్చిన కమిషనర్.. అయినా..
సోమవారం బల్దియాలో ప్రజావాణి 10:30 గంటలకు మొదలుకాగా, 10 :40 నుంచి ఒక్కొక్కరుగా ఆఫీసర్లు రావడం మొదలుపెట్టారు. అడిషనల్ కమిషనర్లతో పాటు పలువురు అధికారులు వచ్చినా జనాలు వారికి ఫిర్యాదు చేసేందుకు ఆసక్తి చూపలేదు. మొదటిసారి వచ్చిన 5 నుంచి 10 మంది వారికి తమ ఫిర్యాదులు ఇచ్చి వెళ్లిపోయారు. మరో 40 మంది పదిన్నర గంటలకంటే ముందే వచ్చినా కమిషనర్కోసం వేచి చూశారు. కమిషనర్11:40 నిమిషాలకు రావడంతో ఆయనకు ఫిర్యాదు చేసి సమస్యలు చెప్పుకున్నారు.
ఆయనకే ఎందుకంటే...
కొంత కాలంగా కమిషనర్ ఇలంబరితి ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై స్పెషల్‌ఫోకస్ పెట్టారు. ఆయన దగ్గరకు వచ్చే ఫిర్యాదులపై అప్పుడే స్పందిస్తున్నారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. పరిష్కరించలేకపోతే ఫిర్యాదుదారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. ఒక్కోసారి సంబంధిత అధికారులను హెడ్డాఫీసుకు పిలిచి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అడుగుతున్నారు. దీంతో అంతా నేరుగా కమిషనర్ కు ఫిర్యాదులు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
కార్డుల జారీలో లేట్ కావొద్దు : కమిషనర్
సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డుల జారీలో ఆలస్యం కాకుండా చూడాలని బల్దియా కమిషనర్ ఇలంబరితి అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణిలో కమిషనర్ మాట్లాడుతూ... సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు చేయడంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజావాణిలో 82 ఫిర్యాదులు రాగా, అత్యధికంగా టౌన్ ప్లానింగ్ కు సంబంధించి 46 , ఫోన్ ఇన్ ద్వారా 6 ఫిర్యాదులు అందాయి. ఆరు జోన్లలో 112 ఫిర్యాదులు అందగా, కూకట్ పల్లి జోన్ లో 51, ఎల్బీనగర్ 13, శేరిలింగంపల్లి 12, సికింద్రాబాద్ 27, చార్మినార్ 8, ఖైరతాబాద్ లో ఒక్క ఫిర్యాదు అందిందని తెలిపారు. అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, గీతా రాధిక, పంకజ, రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, యాదగిరి రావు,సి సి పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.