ఇవాళ్టి నుంచి బల్దియా కమిషనర్ ఆన్ డ్యూటీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి సోమవారం నుంచి డ్యూటీకి హాజరుకానున్నారు. 26 రోజులపాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అబ్జర్వర్ గా పని చేసిన ఆయన ఫలితాలు రావడంతో ఆదివారం సిటీకి వచ్చారు. సోమవారం  హెడ్ ఆఫీసులో జరిగే ప్రజావాణిలో పాల్గొననున్నారు. 

ఈ నెలలో చేపట్టిన పనులు, పెండింగ్ లో ఉన్న పనులపై  వరుసగా సమీక్షలు చేయనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల ఏర్పాట్లపై, తర్వాత గ్రేటర్ లో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తీరు, డేటా ఎంట్రీ అంశాలపై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ పై సమావేశం నిర్వహించనున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్​పై సంబంధిత అధికారులతో  రివ్యూ నిర్వహించనున్నారు.