స్టెరిలైజేషన్ సంఖ్య పెరిగినప్పుడే వీధికుక్కల నియంత్రణ సాధ్యం : జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

స్టెరిలైజేషన్ సంఖ్య పెరిగినప్పుడే  వీధికుక్కల నియంత్రణ సాధ్యం : జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

హైదరాబాద్ సిటీ/ఎల్బీనగర్, వెలుగు: సిటీలో వీధి కుక్కల బెడదను తగ్గించాలంటే స్టెరిలైజేషన్ అధిక సంఖ్యలో చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్బీనగర్ జోన్ ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రాన్ని, డాగ్ క్యాచింగ్ వెహికల్, కుక్కల ఆపరేషన్ థియేటర్, పెంపుడు కుక్కల క్రిమిటోరియం, సి అండ్ డి ప్రాసెసింగ్ ప్లాంట్లను కమిషనర్ పరిశీలించారు. చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. సర్కిళ్ల వారీగా వెహికల్స్ అందుబాటులో ఉన్నాయని, స్టెరిలైజేషన్​ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

 డాగ్ క్యాచర్ లకు సెట్లను అందజేయాలని సూచించారు. అనంతరం కమిషనర్ భవన నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ యూనిట్లను పరిశీలించారు. 500 టన్నుల కెపాసిటీతో నాలుగు భవన నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. కమిషనర్ వెంట ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ, జోనల్ వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ రంజిత్, హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.