నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు

నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు
  • హైదరాబాద్ నందగిరిహిల్స్​లో ఇష్టారాజ్యంగా కన్​స్ట్రక్షన్   
  • అనుమతులు తెచ్చుకున్నది ఒక లెక్క.. కడుతున్నది మరో లెక్క
  • ప్రతి ఫ్లోరూ నిబంధనలకు విరుద్ధం
  • సెట్ బ్యాక్ కూడా వదల్లేదు   
  • న్యాయం కోసం పోరాడిన  నందగిరి హౌసింగ్ సొసైటీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​ జూబ్లీహిల్స్​రోడ్​నెంబర్​45 నందగిరిహిల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ ను కూల్చెయ్యాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. 2013లో నాలుగు ఫ్లోర్లకు పర్మిషన్లతో మొదలైన నిర్మాణం 2023 వచ్చేసరికి జీ+13 ఫ్లోర్లు.. 5 స్టిల్ట్ ఫ్లోర్లు, ఒక సెల్లార్ కు అనుమతులు తీసుకునే వరకూ వెళ్లింది. సెల్లార్ల నుంచి మొదలుపెడితే స్టిల్ట్ ఫ్లోర్లు, దానిపైన ఫ్లోర్ల నిర్మాణంలోనూ రూల్స్​బ్రేక్​చేసింది. ప్రతి ఫ్లోర్​ను జీహెచ్ఎంసీ పర్మిషన్​ఇచ్చిన దానికంటే పెంచి కట్టేసింది. దీంతో విజిలెన్స్​ఎంక్వైరీ, కోర్టు కేసులు, అధికారుల విచారణల పేరిట 12 ఏండ్ల కాలం గడిచిపోగా, ఎట్టకేలకు బిల్డింగ్ ను కూల్చివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.  

ఒకటే సెల్లార్.. 5 స్టిల్ట్​ ఫ్లోర్లతో మొదలు  

నెట్​నెట్​ వెంచర్స్​2013లో ఒక సెల్లార్, ఐదు స్టిల్ట్ ఫ్లోర్లు, ఒక అంతస్తు ఎన్విరాన్మెంట్​ డెక్​తో పాటు10 ఫ్లోర్లకు అనుమతులు తీసుకుంది. తర్వాత టీడీఆర్ కట్టి మరో 2 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుంది. అయితే, సదరు సంస్థ అనుమతులకు విరుద్ధంగా స్లాబులు నిర్మించడంతో పాటు సెట్ బ్యాక్ కూడా వదల్లేదు. దీనిపై నందగిరి కోఆపరేటివ్​ హౌసింగ్​ సొసైటీ ఏండ్లుగా ఫిర్యాదులు చేస్తుండడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అందులోనూ సదరు సంస్థ నిబంధనలు పాటించలేదని తేలింది. దీంతో చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విషయంలో జీహెచ్ఎంసీ వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు నోటీసులిచ్చింది. మరోసారి విచారణ జరిపిన కమిషనర్ ఇలంబరితి రూల్స్​పాటించలేదన్నది నిజమేనని తేల్చారు. 

ALSO READ : హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్లు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి

గతేడాది ఏప్రిల్ 4న స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వగా మే 27న ఫైనల్ స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అప్పట్లో తమ వాదనలు వినకుండా ఆర్డర్ ఇస్తున్నారని  నెట్ నెట్ సంస్థ యజమాన్యం సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించింది. ఈ ఆర్డర్లను వెనక్కి తీసుకోవాలని, మరోసారి విచారణ జరపాలని కోర్టు కమిషనర్ ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కమిషనర్ ఇప్పటివరకు నాలుగుసార్లు హియరింగ్ నిర్వహించారు. అందులో 7 మీటర్ల సెట్ బ్యాక్ వదలలేదని, 5 మీటర్లకు బదులు 4.5 మీటర్ల ఎత్తుతో 5 స్టిల్ట్ ఫ్లోర్లు నిర్మించారని, 6 మీటర్లకు బదులుగా 4.5 మీటర్లలో ఎన్విరాన్మెంట్​డెక్​, ఓపెన్ స్పేస్ ఒక ఫ్లోర్, స్టిల్ట్ ఫ్లోర్ పై నుంచి ప్రతి స్లాబ్ ఎత్తును 3 మీటర్ల నుంచి 4.5  మీటర్లకు పెంచుతూ 7 అంతస్తులను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ప్రతి ఫ్లోర్​నూ కూల్చివేయాల్సిందేనని, లేకపోతే తామే కూల్చివేస్తామని కమిషనర్​ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

అనుమతులు ఇలా.. 

2012లో పబ్లిక్ యాక్షన్ ద్వారా హెచ్ఎండీఏ నందగిరి హిల్స్​లో 4.74 ఎకరాలను అమ్మకానికి పెట్టింది. నెట్​నెట్ ​వెంచర్స్ సంస్థ ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి అప్లై చేయగా 2013లో ఉన్న మున్సిపాలిటీ రూల్స్​ ప్రకారం జీ +4తో పాటు 5 నుంచి 7 సెల్లార్ల వరకు నిర్మించుకోవచ్చని పర్మిషన్​ఇచ్చింది. కమర్షియల్ ​కాంప్లెక్స్​ నిర్మాణం కోసం నందగిరి హిల్స్ పరిధిలో ఉన్న హెచ్ఎండీఏకు చెందిన 4.74 ఎకరాలను, జూబ్లీహిల్స్​ రోడ్​ నం.45లో ఉన్న లే అవుట్​లోని 865.42 గజాల విస్తీర్ణం ప్లాట్​ను ఒకే స్థలంగా చూపి నెట్ నెట్ సంస్థ అనుమతులు తెచ్చుకున్నది. జూబ్లీహిల్స్ లేఅవుట్​కు వర్తించే జీవో ఎంఎస్ నంబర్ 305ను నందగిరి హిల్స్​లోని 4.74 ఎకరాల స్థలానికి వర్తింపజేసింది. ఇందుకు అప్పటి జీహెచ్ఎంసీ అధికారులు సహకరించారన్న ఆరోపణలున్నాయి. 2017 డిసెంబర్​7న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్​305 ప్రకారం 30 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే భవనాల నిర్మాణాలను అనుమతిస్తారు. ఇంపాక్ట్ ఫీజు కడితే 45 మీటర్ల వరకు కట్టుకోవచ్చు. కానీ, నెట్ నెట్​సంస్థ ఈ రూల్స్​పాటించలేదు.   

ఒక్కో ఏడాది ఒక్కో విధంగా..

జూబ్లీహిల్స్​ రోడ్ నం.45 వైపు 30 మీటర్ల అనుమతి మాత్రమే ఉండగా, ఇంపాక్ట్​ ఫీజు చెల్లించి 45 మీటర్లకు అనుమతి తెచ్చుకున్నారు. జూబ్లీహిల్స్​ప్లాట్​నుంచి దారి చూపిస్తూ నందగిరి హిల్స్​లోనూ రూల్స్​కు విరుద్ధంగా అనుమతులు తెచ్చుకున్నారు. అలా 2013లో జీ+4 ఫ్లోర్లు.. 5 నుంచి 7 సెల్లార్లు, 2021లో జీ+5 ఫ్లోర్లు.. అప్పర్​ఫ్లోర్లు, 7 స్టిల్ట్ ఫ్లోర్స్, 2022లో జీ+12 ఫ్లోర్లు​..7 స్టిల్ట్ ఫ్లోర్లు, 2023లో జీ+13 ఫ్లోర్లు..5 స్టిల్ట్ ఫ్లోర్లు​, ఒక సెల్లార్​కు పర్మిషన్లు తీసుకున్నారు. ప్రస్తుతం 50 మీటర్ల ఎత్తుకు అనుమతి కోసం అప్లై చేసుకోగా అధికారులు పెండింగ్​లో పెట్టారు. ఈ బిల్డింగ్ లో షాపింగ్​మాల్స్, స్టార్​ హోటల్స్​నిర్మించాలని ప్లాన్​చేశారు. అయితే, ఎన్విరాన్మెంట్​రూల్స్​ప్రకారం ఈ ప్రాంతంలో అలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. 

పర్యావరణానికి ముప్పు

నెట్​నెట్ వెంచర్స్ కమర్షియల్​కాంప్లెక్స్ నిర్మిస్తున్న ప్రాంతం.. కేబీఆర్ నేషనల్​పార్క్​కు అత్యంత సమీపంలో పర్యావరణపరంగా సున్నితమైన జోన్​లో ఉంది. పార్కుకు కేవలం 40 మీటర్ల పరిధిలో, 100 అడుగుల లోతులో తవ్వకాలు జరిపి, 450 అడుగుల ఎత్తులో బిల్డింగ్స్ నిర్మించారు. 2,09,000 చదరపు మీటర్లలో నిర్మిస్తున్న ఈ మల్టీపర్పస్​బిల్డింగ్​లో 6 వేల కార్లు, 2 వేల బైక్స్​పార్క్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల పొల్యూషన్​, వాహనాల రణగొణ ధ్వనులతో పర్యావరణానికి, పార్కులోని జంతుజాలం మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం1.5 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో భారీ భవనాలు నిర్మిస్తున్నప్పుడు పబ్లిక్ హియరింగ్​తప్పనిసరి. కానీ ఇక్కడ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే అనుమతులు జారీ చేశారు.