హైదరాబాద్​లో 142, సికింద్రాబాద్​లో125 రౌండ్లు : రోనాల్డ్ రోస్

 హైదరాబాద్​లో 142, సికింద్రాబాద్​లో125 రౌండ్లు : రోనాల్డ్ రోస్
  • జిల్లాలో16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శనివారం నిజాం కాలేజీలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 13 లోకేషన్లలో16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 20 టేబుల్స్, మిగలిన స్థానాల పరిధిలో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామన్నారు. యాకుత్ పురా సెగ్మెంట్​లో అత్యధికంగా 24 రౌండ్లు, చార్మినార్ సెగ్మెంట్​లో అత్యల్పంగా 15 రౌండ్లతో కౌంటింగ్​పూర్తవుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కోసం 1,200 మంది సిబ్బందిని, వెయ్యి మందికి పైగా ఇతర సిబ్బందిని నియమించామన్నారు. 

హైదరాబాద్ లోక్​సభ స్థానానికి 142 రౌండ్లు, సికింద్రాబాద్ స్థానానికి 125 రౌండ్లు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 17 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, ఆర్డీఓ మహిపాల్​రెడ్డి పాల్గొన్నారు.