- బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్
- పాతబస్తీలో పలు కట్టడాల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: పాతబస్తీలో పురాతన కట్టడాలను బాగు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. శుక్రవారం సిటీలో ప్రాచుర్యం పొందిన పలు పురాతన కట్టడాలను పరిశీలించి, చేపట్టబోయే పనులపై కమిషనర్ చర్చించారు. ముందుగా కమిషనర్ దారుల్ షిఫా (ఓల్డ్ఎంసీహెచ్ ఆఫీస్) సర్దార్ మహల్, చార్మినార్ ఓల్డ్ బస్టాండ్, ముర్గీ చౌక్, ఖుర్షీద్ ఝా దేవిడి, సాలార్ జంగ్ మ్యూజియం ఎదురుగా ఐకా న్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే ప్రాంతాలను పరిశీలించారు.
ALSO READ :ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలె
ఒక్కొక్కటి రూ.30 కోట్ల అంచనాతో చేపట్టే ముర్గీచౌక్ సర్దార్ మహల్ పునరు ద్ధరణ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. చార్మినార్ ఓల్డ్ బస్టాండ్ అభివృద్ధికి బీఓటీ పద్ధతిపై నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఖుర్షీద్ ఝా దేవిడికి రూ.12 కోట్ల అంచనాతో చేపట్టనున్న పనులకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సాలార్జంగ్ మ్యూజియం వద్ద రెండు వైపుల రూ.40 కోట్ల అంచనాతో ఐకాన్ బ్రిడ్జి చేపట్టనున్నారని తెలిపారు. ఆయన వెంట సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ సెక్రటరీ శంకర్ లాల్, సీఈ గురు వీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, జోనల్ కమిషనర్ ఉన్నారు.