
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాబ్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఇలంబర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 మంది న్యాక్ ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆదివారం (మార్చి 23) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు న్యాక్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు న్యాక్ ఇంజనీర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
న్యాక్ ఇంజనీర్లపై అవినీతి ఆరోపణలు రావడంతో కమిషనర్ ఇలంబరితి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ విచారణలో 27 మంది న్యాక్ ఇంజనీర్లు అవినీతికి పాల్పడ్డట్లు తేలింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా అవినీతికి పాల్పడ్డ 27 మంది న్యాక్ ఇంజనీర్లను కమిషనర్ ఇలంబర్తి ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలపై ఒకేసారి 27 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం జీహెచ్ఎంసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.