పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తాం : రామకృష్ణారెడ్డి

పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తాం : రామకృష్ణారెడ్డి
  • జీహెచ్ఎంసీని హెచ్చరించిన కాంట్రాక్టర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే అభివృద్ధి పనులను ఆపేస్తామని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్​ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పనుల బిల్లులతోపాటు పెండింగ్ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. అయిపోయిన పనులకు సంబంధించిన ఆడిటింగ్​పూర్తయినా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదన్నారు.

అధికారులకు అనుకూలమైన వారికి మాత్రమే రిలీజ్​చేస్తున్నారని, మిగిలిన వారి బిల్లులు తమ పరిధి కాదంటూ దాటవేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఢిల్లీలోని ఈసీ ఆఫీసు, రాష్ట్రపతి ఆఫీసులో ఫిర్యాదు చేశామన్నారు. 15 నియోజకవర్గాలకు సంబంధించిన రూ.27 కోట్ల50 లక్షలను విడుదల చేయకుండా, మలక్ పేట నియోజకవర్గానికి మాత్రమే బిల్లులు క్లియర్​చేశారన్నారు. మిగిలిన 14 నియోజకవర్గాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కొందరు అధికారులు బిల్లుల్లో కొంత పర్సంటేజ్​తీసుకున్నారని ఆరోపించారు. అసోసియేషన్​జనరల్ సెక్రెటరీ సాయికిరణ్ తదితరులు ఉన్నారు.