హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కారు దిగుతున్నారు. హస్తం అందుకునేందుకు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత కూడా కార్పొరేటర్లు వరుసగా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇందులో ప్రధానంగా మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ సహా ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, మరికొందరు ఉన్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ఇంకొందరు కార్పొరేటర్లు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్నుంచి నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పెద్దలతో టచ్ ఉన్నట్లు ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ క్షణమైనా వారు పార్టీ మారొచ్చని పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు రెండునెలల ముందు వరకు కాంగ్రెస్ కు నలుగురు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు.
అప్పట్లో ఒక కార్పొరేటర్ కాంగ్రెస్ ను వీడగా, ఆ తర్వాత బీఆర్ఎస్లోంచి ఆరుగురు చేరారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో హస్తం కార్పొరేటర్లు12 మంది ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్హవా కొనసాగినా.. గ్రేటర్ పరిధిలో బిగ్ షాక్ తగిలింది. 24 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. బీఆర్ఎస్17 , ఎంఐఎం 7, బీజేపీ 1 చొప్పున ఎమ్మెల్యేలను గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి బయటపడేందుకు గ్రేటర్ లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం ప్లాన్ చేసింది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి చేరేందుకు ముందుకొచ్చిన కార్పొరేటర్లను కాంగ్రెస్‌లో జాయిన్ చేసుకుంటుంది.
గెలిపించినా పట్టించుకోవడంలేదంటూ..
గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్తమను పట్టించుకోలేదని, ఎన్నికలప్పుడే వాడుకొని ఆ తర్వాత పక్కనపెట్టిందని ఆ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. తాము పనిచేస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో అన్ని సీట్లు గెలిచిందని కూడా సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. అధికారం కోల్పోయాక కూడా కార్పొరేటర్లను పెద్దగా పట్టించుకోలేదని, దీంతోనే పార్టీ మారేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లో చేరితే అసెంబ్లీ సెగ్మెంట్ లో పార్టీని డెవలప్ చేస్తే ఫ్యూచర్ లో తమకు ఏవైనా చాన్స్ వస్తుందనే భవిష్యత్ ఆలోచనతో కూడా కార్పొరేటర్లు పార్టీ మారుతున్నట్టు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో గట్టిగా పనిచేస్తే అధిష్టానం కూడా తమకు అండగా ఉంటుందని కార్పొరేటర్లు ఆలోచిస్తున్నారు. వచ్చే రెండేండ్ల తర్వాత గ్రేటర్ కు ఎన్నికలు ఉంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్సర్కార్ అధికారంలో ఉండడంతో గ్రేటర్ పీఠం కూడా ఆ పార్టీకి దక్కే చాన్స్ ఉండొచ్చని, మరోసారి కార్పొరేటర్ గా గెలవచ్చనే భావనతో కూడా కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆయనతో పాటు ఇంకొందరు నేతలు కూడా చేరారు.
3 నుంచి 12కు చేరిన కార్పొరేటర్లు
మూడేండ్ల కింద గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్నుంచి 56 , బీజేపీ నుంచి 48 , ఎంఐఎం నుంచి 44 మంది, కాంగ్రెస్‌నుంచి 2 చొప్పున కార్పొరేటర్లు గెలుపొందారు. ఇందులో లింగోజీగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకస్మికంగా మరణించాడు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో బీజేపీకి 47, కాంగ్రెస్‌కు కార్పొరేటర్లు 3గా ఉంది. అనంతరం ఎంఐఎం కార్పొరేటర్లు తప్ప మిగతా వారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అనంతరం పార్టీలు మారారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు53 మంది, ఎంఐఎంకు 44 మంది, బీజేపీకి 40 మంది, కాంగ్రెస్‌కు12 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో ఎంఐఎం నుంచి ఇద్దరు కార్పొరేటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గుడిమల్కాపూర్ తో పాటు 3 సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.