బీఆర్ఎస్ కార్పొరేటర్లు రౌడీల్లా వ్యవహరించిన్రు

బీఆర్ఎస్ కార్పొరేటర్లు రౌడీల్లా వ్యవహరించిన్రు
  • హైకమాండ్ ​మెప్పు కోసం ఇష్టారీతిన ప్రవర్తించారు
  • కాంగ్రెస్ ​కార్పొరేటర్లు ఫైర్
  • బీఆర్ఎస్​ మహిళా కార్పొరేటర్లు గోర్లలో విషం పెట్టుకుని దాడి చేశారు
  • మాజీ డిప్యూటీ మేయర్​బాబా ఫసియొద్దీన్​ ఆరోపణ

హైదరాబాద్ సిటీ, వెలుగు : కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు రౌడీల్లా వ్యవహరించారని కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మేయర్​విజయలక్ష్మితో సమావేశమై కౌన్సిల్ మీటింగ్​లో జరిగిన ఘటనను వివరించారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ మాట్లాడూ.. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బూతులు తిడుతూ తనపై దాడి చేశారని, గోళ్లలో విషం పెట్టుకుని వచ్చారని ఆరోపించారు. తన చేతికి గాయమైందని తెలిపారు. దాడి వెనుక ఆ పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ఉన్నారని ఆరోపించారు. 

తాము పార్టీ మారామని అంటున్నవారు.. ఏ పార్టీల నుంచి వచ్చారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే తలసాని, మాగంటి గోపినాథ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పట్లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఆఎస్ చేరలేదా అని నిలదీశారు. అభివృద్ధిని చూడలేక, చర్చించలేక ఇలా దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్​ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్​తట్టుకోలేకపోతుందన్నారు. కౌన్సిల్ లో సిటీ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు.

 చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ లో మేయర్​ను, సభను గౌరవించకుండా రౌడీల్లా బిహేవ్ చేశారన్నారు. వాళ్ల పార్టీ అధిష్ఠానం మెప్పు కోసం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారన్నారు. రహయత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. సభను రాష్ట్రమంతా చూసిందని, ప్రజా సమస్యలను చర్చించకుండా గుండాల్లా ప్రవర్తించడం కరెక్ట్​కాదన్నారు. 

బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన

ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా కౌన్సిల్ మీటింగులో మేయర్ విజయలక్ష్మి వ్యవహరించారంటూ శుక్రవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్​వద్ద నిరసన తెలిపారు. తర్వాత మేయర్ చాంబర్ ముందు బైఠాయించి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. 

బీఆర్ఎస్​మహిళా కార్పొరేటర్లపై దాడి చేసిన కాంగ్రెస్​కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమను బలవంతంగా మార్షల్స్ తో బయటకు పంపించారన్నారు. ఏకపక్షంగా బడ్జెట్ ఆమోదించారని మండిపడ్డారు. కార్పొరేటర్లు రవీందర్ రెడ్డి, నరసింహ యాదవ్, శ్రీనివాసరావు, విజయశాంతి పాల్గొన్నారు.