జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాస.. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ బడ్జెట్ ఆమోదం

జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాస.. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ బడ్జెట్ ఆమోదం

 జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా మారింది.  సభలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ కార్పోరేటర్లు అడ్డుకున్నారు. అయితే సభ ప్రారంభమైన కాసేపటికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాలకు సంతాపం తెలిపారు.

సంతాపం అనంతరం ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతామని మేయర్ ప్రకటించారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని, ఆ తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ పోడియం ముట్టడికి బీఆర్ఎస్ సభ్యుల యత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్పోరేటర్లు CN రెడ్డి, బాబా ఫసియుద్దీన్ అడ్డుకుని,  బీ ఆర్ ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులు లాక్కొని చించేశారు. దీంతో సభలో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు.

 మేయర్ పోడియం వద్దకు చేరుకుని బీఆర్ఎస్ సభ్యులు  మేయర్ పోడియం పై ప్లకార్డులు విసిరారు. దీంతో ఐదు నిమిషాల పాటు సభను వాయిదా వేశారు మేయర్. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యుల ఆందోళనను విరమించాలేదు. సభ నడవడానికి సభ్యులు సహకరించాలని మేయర్ కోరారు. బడ్జెట్ పై చర్చించాల్సిన అవసరం ఉందని, సహకరించాలని మేయర్ కోరినప్పటికీ సభ్యులు ఆందోళన విరమించలేదు. 

బడ్జెట్ ఆమోదిస్తూ ప్రకటన చేసిన మేయర్:


సభ్యులు ఎంతమేరకూ ఆందోళన విరమించకపోవడంతో మేయర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి 8,440 కోట్ల రూపాయల బడ్జెట్ ఆమోదిస్తూ ప్రకటన చేశారు. సభ్యులు సహకరించకపోవడంతో మేయర్ విచక్షణాధికారంతో బడ్జెట్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరో పది నిమిషాలు సభను వాయిదా వేశారు. 

ముగ్గురు బీఆర్ఎస్ సభ్యుల ను బయటకి తీసుకెళ్ళిన మార్షల్స్:

10 నిమిషాల తర్వాత తిరిగి సభ ప్రారంభం అయ్యింది. ముగ్గురు బీఆర్ఎస్ సభ్యుల ను బయటకి తీసుకెళ్ళారు మార్షల్స్.  జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి పోలీస్ వాహనంలో బయటకి తీసుకెళ్లారు. ఆ తర్వాత క్వశ్చన్ హవర్ ప్రారంభం అవ్వగా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బయటకి తీసుకెళ్లిన బీ ఆర్ ఎస్ కార్పొరేటర్ల ను హౌజ్ లోకి తీసుకురావాలని నినాదాలు చేశారు. 

బీఆర్ఎస్ సభ్యులు తనపై పేపర్లు విసిరారని మేయర్ అన్నారు. మేయర్ కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్ చేశారు. మరోసారి మేయర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలుపారు బీ ఆర్ ఎస్ సభ్యులు. ఆ తర్వాత సభను మరో పది నిమిషాలు వాయిదా వేశారు మేయర్. అరెస్టు చేసిన కార్పొరేటర్లను మళ్లీ జిహెచ్ఎంసి కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసులు.