- కౌన్సిల్ మీటింగులో 8 అంశాలపై సభ్యుల ప్రశ్నలు
- లైట్ల సమస్య పరిష్కరిస్తామన్న కమిషనర్
- పారిశుద్ధ్య కార్మికులు లేరన్న సభ్యులు
- కొత్తవారు కావాలంటే సర్కారు పర్మిషన్ ఉండాలన్న అధికారులు
- వాటర్ బోర్డు ఎండీ రాలేదంటూ మేయర్ విజయలక్ష్మి అసంతృప్తి
- వచ్చి వెళ్లిపోయారన్న కమిషనర్ ఇలంబరితి
హైదరాబాద్సిటీ, వెలుగు: దాదాపు ఎనిమిది నెలల తర్వాత బల్దియా సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో ఎనిమిది ప్రశ్నలపై సభ్యులు ప్రశ్నలు సంధించగా అధికారులు సమాధానాలిచ్చారు. 132 మంది కార్పొరేటర్లు, 29 ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో లంచ్తర్వాత స్ట్రీట్లైట్లు, నాలాలు, శానిటేషన్ తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి డివిజన్ కు 30 లైట్లు ఇచ్చారని, 72 కాలనీలు ఉంటే వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలని అడిగారు. చాలాచోట్ల లైట్లు వెలగడం లేదన్నారు. ఎఐంఎ కార్పొరేటర్ సలీంబేగ్ మాట్లాడుతూ లైట్లు లేక రోడ్లపై యాక్సిడెంట్లు అవుతున్నాయని, ఓల్డ్ సిటీలో తల్లికూతురు మరణించారన్నారు. దీనిపై కమిషనర్ ఇలంబరితి సమాధానం ఇస్తూ ఈఈఎస్ఎల్ నుంచి 5.5లక్షల లైట్లు ఏర్పాటు చేశామని, బిల్లులు విషయంలో సమస్యతో ఆ సంస్థ పని చేయక ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఇప్పుడు అంతా క్లియరైందన్నారు. కొత్తగా 15,500 లైట్లు కొన్నామని, 3,500 లైట్లు ఏర్పాటు చేశామన్నారు.
పూడిక తీస్తలేరు..
నగరంలో నాలాల్లో పూడిక తీయడంలేదని కొందరు ప్రశ్నించగా, మరికొందరు నాలాల రిపేర్లు చేయాలని కోరారు. దీనికి అధికారులు పనులు చేస్తామని సమాధానమిచ్చారు. శానిటేషన్పై పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సరిపోవడంలేదని, ఉన్నవారిలో కొందరు పదవీవిరమణ పొందగా, ఇంకొందరు పెద్దవాళ్లు కావడంలో పనులు చేయలేకపో తున్నారన్నారు. కార్మికులను పెంచితే సమస్య తీరుతుందన్నారు. కొత్త కార్మికులను తీసుకునేందుకు అనుమతి లేదని, ఇందుకోసం ప్రభుత్వ పర్మిషన్ కోసం లెటర్ రాస్తామని అధికారులు సమాధానమిచ్చారు.
అలాగే స్టేడియాల్లో కోచ్లు లేరని, ఇతర సమస్యలు ఉన్నాయని, బాక్సింగ్రింగ్ఏర్పాటు చేయాలని, కొత్త స్టేడియాలు నిర్మించాలని, కమ్యూనిటీ హాల్స్ కు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. కమిషనర్ ఇలంబరితి, అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు సమాధానమిస్తూ బల్దియాలో 71 మంది పార్ట్ టైమ్ కోచ్ లు ఉన్నారని, 997 మంది హనరరీ కోచ్ లు ఉన్నారన్నారు. ఫుల్ టైమ్ కోచ్ లు తీసుకునేందుకు అనుమతి లేదన్నారు.
వాటర్ బోర్డు అధికారులపై అసంతృప్తి
వాటర్ బోర్డు అధికారుల తీరుపై సభలో మేయర్ సహా కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ సమావేశానికి ఎండీ రావడంలేదని మండిపడ్డారు. డివిజన్లలో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, దీనిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కమిషనర్ స్పందిస్తూ వాటర్ బోర్డు ఎండీ మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నారని, వేరే మీటింగ్కు వెళ్లారన్నారు.
ఆదాయ పెంపుపై దృష్టి పెట్టండి: బల్దియా ఆదాయం పెంచే అంశంపై దృష్టి పెట్టాలని సభ్యులను అధికారులకు సూచించారు. గతంలో అడ్వటైజ్మెంట్ వల్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు పాలసీ లేకపోవడంతో కూడా ఆదాయం రావడంలేదన్నారు. ట్రేడ్ లైసెన్స్ ల విషయంలో కార్పొరేట్ స్కూల్స్ నుంచి పక్కాగా వసూలు చేసేందుకు డ్రైవ్ నిర్వహించాలని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కోరారు.
ఎల్బీనగర్ లో ట్యాక్స్ లు ఎక్కువ: బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లిలతో పోలిస్తే ఎల్బీనగర్ జోన్ లో ట్యాక్స్ లు ఎక్కువగా ఉన్నాయని మన్సూరాబాద్కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి అన్నారు. కమిషనర్ దృష్టి పెట్టి తమ ప్రజలకు న్యాయం చేయాలన్నారు.
ఇద్దరు మంత్రులు ఏమిచ్చారు: రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారని, నగరానికి ఎన్ని నిధులు తెచ్చారని మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్బీజేపీ సభ్యులను ప్రశ్నించారు.
తొలిసారి మాట్లాడిన డిప్యూటీ మేయర్: ఇప్పటి వరకు 10వ సాధారణ సమావేశాలు జరగగా డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి తొలిసారి మాట్లాడారు. కార్పొరేటర్లకు ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రతిఏటా గేమ్స్ ఏర్పాటు చేస్తున్నారని, ఈ సారి కూడా ఏర్పాటు చేయాలన్నారు.