జనం సమస్యలు చర్చ జరగకుండానే .. ముగిసిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్

 జనం సమస్యలు చర్చ జరగకుండానే .. ముగిసిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్
  • ఎంపిక చేసిన 20 ప్రశ్నల్లో ఏ ఒక్కదానిపై చర్చించలే
  • నాలుగు పార్టీల కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం.. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట
  • మూడు సార్లు ఆపి, చివరికి నిరవధిక వాయిదా

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో శనివారం నిర్వహించిన తొమ్మిదో కౌన్సిల్ ​మీటింగ్ ఎప్పటిలాగే సమస్యలపై చర్చ జరగకుండానే ముగిసింది. సభ్యుల నుంచి మొత్తం 148 ప్రశ్నలు రాగా, అధికారులు 20 ప్రశ్నలను చర్చించేందుకు ఎంపిక చేశారు. అయితే ఏ ఒక్కదానిపై కార్పొరేటర్లు చర్చించ లేదు. ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కాగా, లంచ్ బ్రేక్​కు ముందే మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. సిటీ ప్రజల సమస్యలను గాలికొదిలేసి నాలుగు ప్రధాన పార్టీల కార్పొరేటర్లు ఆందోళనలతో సరిపెట్టారు. ముందుగా మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్​కార్పొరేటర్లు పోడియం వద్ద ఆందోళనకు దిగారు.

వీరికి కౌంటర్ గా కాంగ్రెస్​ నేతలు నినాదాలు అక్కడికి చేరుకున్నారు. అంతలోనే ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉన్న ఫొటోతో బీజేపీ సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శించడంపై ఎంఐఎం సభ్యులు మండిపడ్డారు. వాటిని లాక్కునే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మార్షల్స్ వారిని సముదాయించినప్పటికీ, వాగ్వాదం ఆగలేదు. మూడు సార్లు ఆగి.. ఆగి సాగిన సమావేశాన్ని మేయర్​గద్వాల్​విజయలక్ష్మి చివరికి నిరవధిక వాయిదా వేశారు. సీవరేజీ పనులు చేయట్లేదని, దోమలను నివారించడం లేదని సమావేశానికి వచ్చే సమయంలో బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు.

మొదటిసారి 151 మంది హాజరు

తొలిసారి కౌన్సిల్ సమావేశానికి 151 మంది సభ్యులు హాజరయ్యారు. ఇప్పటివరకు జరిగిన 8 సమావేశాల్లో ఎప్పుడూ ఇంత మంది హాజరుకాలేదు. ప్రస్తుతం కార్పొరేటర్లు 147 మంది, ఎక్స్ అఫిషీయో సభ్యులు 42 మంది ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ తోపాటు రాజ్యసభ సభ్యుడు అనీల్ కుమార్ యాదవ్ తొలిసారి కౌన్సిల్ ​సమావేశానికి హాజరయ్యారు.

సమస్యలపై ఫోకస్ ​పెట్టాం: కమిషనర్

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఆఫీసర్ల కొత్త టీమ్​సమస్యలపై ఫోకస్​పెట్టిందన్నారు. బోనాలు, మొహరం, గణేశ్​ఉత్సవాలు  సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షాకాల సమస్యలను పరిష్కరించేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. దాదాపు 150 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించామని, వరదను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సీజనల్​వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు..

డీ సిల్టింగ్, వాటర్ లాగింగ్ కాకుండా తమ టీమ్స్ ​పనిచేస్తున్నాయని ఈవీడీఎం డైరెక్టర్ రంగనాథ్ తెలిపారు. నాలాలు, లేక్స్, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా  చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌన్సిల్ సమావేశంలో పరిచయంలో భాగంగా అడిషనల్ కమిషనర్ స్నేహ శభరీష్ కు అవకాశం కల్పించారు. అనంతరం ఆమె మేయర్ అనుమతితో రెవెన్యూ పెంచేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. జీఐఎస్​ సర్వే చేస్తున్నామని, ఇప్పటికే శాటిలైట్ సర్వే పూర్తయిందన్నారు. డ్రోన్ సర్వే జరుగుతుందని, చివరగా ఇంటింటి సర్వే చేయనున్నట్లు చెప్పారు. సర్వేలు పూర్తయితే ఏటా బల్దియాకు 1,500 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.

అభివృద్ధికి సహకరించాలి: మేయర్

సిటీ సమగ్ర అభివృద్ధికి సభ్యులు సహకరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. ఇటీవల కొత్త కమిషనర్​తో పాటు పలువురు ఉన్నతాధికారులు వచ్చారని, సమస్యలపై ఫోకస్​పెట్టారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెండేళ్లుగా ఎటువంటి పనులు కాలేదని, ఆరు నెలలు ఎన్నికల కోడ్​తో సరిపోయిందని చెప్పారు.