చర్చనా.. రచ్చనా: రేపు ( జనవరి 30 ) జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి అధికార, ప్రతిపక్షాలు రెడీ

చర్చనా.. రచ్చనా: రేపు ( జనవరి 30 ) జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి అధికార, ప్రతిపక్షాలు రెడీ
  • ఇప్పటికే పార్టీల వారీగా కార్పొరేటర్ల సమావేశం   
  • అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీల దిశానిర్దేశం
  • 2025– 26 బడ్జెట్​పై కార్పొరేటర్ల నుంచి 125 ప్రశ్నలు
  • 21 ప్రశ్నలపై చర్చకు ఆమోదం

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా హెడ్ ఆఫీసులో గురువారం కౌన్సిల్ సమావేశం జరగనుంది. దీని కోసం అన్ని పార్టీల కార్పొరేటర్లు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మంగళవారం ఏ పార్టీకి ఆ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా కౌన్సిల్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల ముఖ్య లీడర్లు దిశా నిర్దేశం చేశారు. కౌన్సిల్​లో ప్రశ్నించడానికి కార్పొరేటర్లు 125 ప్రశ్నలివ్వగా, అధికారులు 21 ప్రశ్నలకే ఆమోదం తెలిపారు.

దీంతో మిగతా వాటితో పాటు సమస్యలపై నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్​నుంచి గెలుపొందిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్​ సర్కారు ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో చేరారు. దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్, ఎంఐఎంకి చెందినవారే ఉండడంతో మేయర్ కు మద్దతిచ్చేవారి సంఖ్య తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ లో బడ్జెట్ కి ఆమోదం లభిస్తుందా?లేదా అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్, బీజేపీ సహకరిస్తాయా? లేక రచ్చ చేస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

రెండేండ్ల బడ్జెట్​ ఆమోదానికి..

2025–-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8440 కోట్ల బడ్జెట్ తో పాటు  2024–-25 లో  ప్రవేశపెట్టి సవరించిన రూ. 8,118 కోట్ల బడ్జెట్​పై చర్చించడంతో పాటు ఆమోదం కోసం ఈ కౌన్సిల్​మీటింగ్​నిర్వహిస్తున్నారు. దీనికోసం అధికారులు ఇప్పటికే కార్పొరేటర్ల నుంచి 125  ప్రశ్నలను తీసుకున్నారు. ఇందులో 21 ప్రశ్నలు వేసి చర్చించేందుకు ఆమోదించారు. అయితే, ఇది వరకు చేసిన పనులపై కూడా చర్చించాలని కార్పొరేటర్లు పట్టు బట్టే అవకాశమున్నట్టు సమాచారం. ఇప్పటికే కౌన్సిల్ ఏర్పడి నాలుగేండ్లు కావస్తుండగా, ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయనే దానిపై, అభివృద్ధిపై చర్చకు డిమాండ్ చేయనున్నట్లు తెలిసింది. 

మెజారిటీ లేదు.. ఆమోదం లభిస్తుందా? 

ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సభ్యులు ఒకసారి బడ్జెట్​ను తిరస్కరించి తర్వాత ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్​ నుంచి గెలుపొందిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి..కాంగ్రెస్​ సర్కారు వచ్చాక అధికార పార్టీలో చేరారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా బీఆర్ఎస్, ఎంఐఎంకి చెందినవారే ఉండడం,  మేయర్ కి మద్దతుగా ఎవరు లేకపోవడంతో మొదట బడ్జెట్ కి ఆమోదం లభించలేదు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉండడంతో కౌన్సిల్ లో బడ్జెట్ కి ఆమోదం లభిస్తుందా?లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లుండగా కాంగ్రెస్​ కు 24, బీజేపీకి 39, ఎంఐఎం నుంచి 41, బీఆర్ఎస్ కు 42 మంది కార్పొరేటర్లు ఉన్నారు.  

మేయర్ టార్గెట్​గా బీఆర్ఎస్​

కౌన్సిల్​లో మేయర్​ను టార్గెట్​చేసేందుకు బీఆర్ఎస్​డిసైడ్​అయినట్టు తెలుస్తోంది. ఏడాది పాలనతో పాటు బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్ లో చేరినందుకు నిరసనగా వ్యతిరేక నినాదాలు చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. 

ఇటీవల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మేయర్ అవిశ్వాసపై చర్చించారు. అందుకే కౌన్సిల్ లో మేయర్​లక్ష్యంగా వ్యవహరించాలని అందుకు తగ్గట్టు వ్యూహం రెడీ చేసుకున్నట్టు సమాచారం.  


మేయర్​కు తీవ్ర పరిణామాలు తప్పవ్​

మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు స్టేట్ ఆఫీసులో మంగళవారం మీటింగ్​పెట్టుకున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై  ఎంపీ లక్ష్మణ్ సూచనలు చేశారు. బడ్జెట్ కేటాయింపులపై అధికార పక్షాన్ని నిలదీయాలని సూచించారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నిర్మాణాన్ని వ్యతిరేకించాలని, ఇప్పుడున్న హాస్పిటల్​ఆవరణలోనే  కొత్తగా నిర్మించాలని డిమాండ్ చేయాలని సూచించారు.   జీహెచ్ఎంసీ బీజేపీ  ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ బడ్జెట్ పై ప్రభుత్వాన్ని నిలదీయాలని తీర్మానం చేశామన్నారు. ఈ కౌన్సిల్ లో మేయర్ కు  తీవ్ర పరిణామాలు తప్పవని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహా రెడ్డి అన్నారు. 
 

మేయర్ మీటింగ్​కు కార్పొరేటర్ల డుమ్మా? 

కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ విజయలక్ష్మి నిర్వహించిన  సమావేశానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. మొత్తం 24 మంది కార్పొరేటర్లు ఉండగా ఐదుగురు మాత్రమే వచ్చారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలపై చర్చించాలని అనుకున్నా ఎవరూ రాకపోవడంతో చర్చించలేదు. ఎవరూ లేరని డిప్యూటీ మేయర్ కూడా సమావేశం నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. తర్వాత మేయర్ తన ఛాంబార్ లో మీడియాతో మాట్లాడుతూ తాను కౌన్సిల్ కోసం సమావేశం ఏర్పాటు చేయలేదని, ఐదుగురం అనుకోకుండా కలిశామన్నారు.

అవిశ్వాసం పెట్టేందుకు ప్రతిపక్షాలకు హక్కు ఉందని, కానీ అవిశ్వాసానికి ఎంత మంది కావాలో కూడా బీఆర్ఎస్, బీజేపీలకు తెలియడం లేదన్నారు. వారికి జీహెచ్ఎంసీ యాక్ట్ గురించి తెలియదని, ఎంత మెజారిటీ తో అవిశ్వాసం నెగ్గుతుందో కూడా తెలియదా?అని ప్రశ్నించారు.  బీజేపీ, బీఆర్ఎస్ లు కౌన్సిల్ మీటింగ్ లో రాద్ధాంతం చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో ప్రజా సమస్యలపై చర్చించాలని, దీనికి కార్పొరేటర్లు సహకరించాలన్నారు. గొడవలు చేసేందుకు కౌన్సిల్ వేదిక కాదని, ఇది ఎలక్షన్ ఇయర్, అభివృద్ధి పై కార్పొరేటర్లు దృష్టి పెట్టాలన్నారు.