జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు రచ్చ రచ్చగా మారాయి. బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం చుట్టుముట్టి నిరసనకు దిగారు. గత వారం ఉప్పల్ లో మేయర్ ను సొంత పార్టీ నేతలే అడ్డుకున్న ఫొటోలను కౌన్సిల్ సమావేశాల్లో పట్టుకొని ఆందోళన చేస్తున్నారు. సిటీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని నినాదాలు చేశారు. కార్పొరేటర్లు మేయర్ కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తున్నారు. దీంతో బీజేపీ సభ్యులను బయటకు పంపాలని మేయర్ మార్షల్స్ ను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని పెంచాలని.. ఎప్పటికప్పుడు చెత్తను సేకరించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.
అయితే తాము ఎజెండాను కార్పొరేటర్లందరికి పంపించామని.. అప్పుడు ఎందుకు మాట్లాడాలేదని అని మేయర్ ప్రశ్నించారు. నిజంగా ఎజెండాపై ఏదైనా భేదాభిప్రాయం ఉంటే ముందే తనకు చెప్పాల్సిందన్నారు. బడ్జెట్ ఆమోదం అయిపోయింది.. స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం పొందిందని చెప్పారు. మీరు సరైన డిస్కషన్ కావాలనుకుంటే సహకరించాలని మేయర్ కార్పొరేటర్లను కోరారు. ఈ విధంగా పోడియం దగ్గరికి రావడం సరైనది కాదన్నారు. బీజేపీ కార్పొరేటర్లకు ఎలాంటి సమస్యలు దొరకలేదు కాబట్టి పక్కా పథకంతోనే వచ్చారని మేయర్ ఆరోపించారు.
మేయర్ విజయ లక్ష్మీ అధ్యక్షతన ఇవాళ 2023-24 ఆర్థిక సంవత్సరానికి GHMC కౌన్సిల్ బడ్జెట్ మీటింగ్ జరగుతోంది. ఈ సమావేశంలో అంచనా బడ్జెట్ ను అమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై అధికార పార్టీని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాకపోవడంపై బీజేపీ చర్చించింది. బడ్జెట్ పై సమగ్రంగా చర్చించాలంని కాంగ్రెస్ పట్టుబట్టింది. మొత్తం 6 వేల 224 కోట్ల రూపాయల బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ అమోదం తెలిపింది. బల్దియా బడ్జెట్ సమావేశాలను అధికార, ప్రతిపక్ష పార్టీలు సవాల్గ్ తీసుకున్నాయి.