హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ఎలాంటి చర్చ జరగకుండానే వాయిదా పడింది. ఎన్నో ప్రజా సమస్యలపై చర్చిద్దామని వచ్చిన కార్పొరేటర్లకు చేదు అనుభవం ఎదురైంది. మొదలైన 20 నిమిషాల్లోనే అధికారులు వాకౌట్ చేయడంతో మీటింగ్ ముగిసింది. ఇటీవల కాలంలో గ్రేటర్ వ్యాప్తంగా జరిగిన అగ్ని ప్రమాదాలు, వర్షాలకు కాలనీలు మునగడం, నాలాల్లో పడి చనిపోవడం, కుక్కల దాడికి చిన్నారులు బలి కావడం, దోమల బెడద తదితర అంశాలపై నిరసన వ్యక్తం చేసేందుకు బీజేపీ కార్పొరేటర్లు లైఫ్ జాకెట్లు, ఫైర్ సిలిండర్, స్విమ్మింగ్ ట్యూబ్‌లు ధరించడంతో పాటు గొడుగులతో, మస్కిటో గెటప్‌లో కౌన్సిల్ హాల్ వద్దకు వచ్చారు. పోలీసులు అనుమతించకపోవడంతో బల్దియా హెడ్డాఫీసు ముందు నిరసన తెలిపారు.
కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా జీహెచ్ఎంసీకి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. సిటీ ప్రజలకు రక్షణ కరువైందని నినాదాలు చేశారు. అనంతరం మీటింగ్ హాల్లోకి వెళ్లారు. కాగా మొదలైన కొద్దిసేపటికే అధికారులు వాకౌట్ చేసి వెళ్లిపోవడంతో, సభను వాయిదా వేస్తున్నట్లు మేయర్విజయలక్ష్మి ప్రకటించి వెళ్లిపోయారు. బీజేపీ కార్పొరేటర్లు మాత్రం మేయర్ రావాలని నినాదాలు చేశారు. సాయంత్రం వరకు కౌన్సిల్ హాల్లోనే కూర్చున్నారు. ఇదే సమయంలో మాక్ కౌన్సిల్ నిర్వహించారు. మేయర్ మాదిరిగా మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ వ్యవహరించారు. బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నలు వేశారు.
కార్పొరేటర్లు మర్యాదగా ప్రవర్తించాలి: జడ్సీ మమత
కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత సూచించారు. కౌన్సిల్ సమావేశాన్ని బాయ్‌కాట్‌చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్పొరేటర్లు అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించారన్నారు. వాటర్‌బోర్డు ఆఫీస్ వద్ద, చాంబర్లో ఎలాంటి సంస్కారం, పద్ధతి లేకుండా సిల్ట్ తెచ్చి పోయడాన్ని, అధికారులపై అనుచితంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాటర్‌బోర్డు అధికారులకు మద్దతుగా కౌన్సిల్ మీటింగ్‌ను బాయ్‌కాట్ చేసినట్లు చెప్పారు. ఇలాగే ప్రవర్తిస్తే కార్పొరేటర్లకు ఏ ఒక్క అధికారి కూడా సహకరించరన్నారు. అధికారులు మంచిగా పనిచేస్తున్నారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందని చెప్పారు. మమతతో ఈఎన్సీ జియావుద్దీన్, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్లు రవి కిరణ్, శంకరయ్య, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్అశోక్ తదితరులు ఉన్నారు.
వాటర్ బోర్డు ముందు అధికారుల నిరసన
మంగళవారం బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన తీరును ఖండిస్తూ వాటర్ బోర్డు అధికారులు బుధవారం వాటర్ బోర్డు హెడ్డాఫీసు ముందు నిరసన తెలిపారు. ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాదాపూర్ జీఎం రాజశేఖర్ మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్లు ఆఫీసులో సిల్ట్ వేయడమేంటని ప్రశ్నించారు. మహిళా అధికారి చాంబర్లో వేసి అవమానపరిచారన్నారు. ప్రజా సమస్యలపై 24 గంటలు పనిచేస్తున్నామని, ఇలాంటి ఘటనలతో తమ మనోభావాలు దెబ్బతింటాయన్నారు. అసోసియేషన్ సెక్రటరీ హరిశంకర్, వాటర్ వర్క్స్ ఎంప్లాయ్స్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ.. కార్పొరేటర్లు వాటర్‌బోర్డు ఆఫీసుపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. సంస్థలో దాదాపు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని, ఇలాంటి ఘటనలతో భయాందోళనకు గురవుతున్నారన్నారు.
పార్టీలకు అతీతంగా సహకరించాలి: వాటర్ బోర్డు ఎండీ
వాటర్ బోర్డు ఆఫీసుపై జరిగిన దాడి బాధాకరమని ఎండీ దానకిశోర్ అన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు. తగిన సహకారం అందించినప్పుడే, మంచి సేవలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు.
సిల్ట్ పోసి నిరసన తెలపడం తప్పా?
పక్కా స్ర్కిప్ట్, ప్లాన్ ప్రకారం అధికారులతో సమావేశాన్ని బాయ్‌కాట్ చేయించారు. సమస్యలపై చర్చిద్దామని కౌన్సిల్‌కు వస్తే.. ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా వేశారు. వాటర్‌బోర్డు ఆఫీస్ ముందు సిల్ట్ పోసి నిరసన తెలపడం తప్పా? అధికారులు కొన్ని నిమిషాలు కూడా కంపును భరించలేకపోతే, మరి రోజుల తరబడి జనం ఎలా తట్టుకుంటారు. నిరసనను కారణంగా చూపి సమావేశాన్ని బాయ్‌కాట్ చేయడమేంటి? ఇదంతా కావాలనే చేశారు.
– ఆకుల శ్రీవాణి, సరూర్‌నగర్ కార్పొరేటర్
ఎన్నో ప్రశ్నలతో వచ్చాం
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లను నామమాత్రంగా పెడుతున్నారు. ప్రతిసారి మేయర్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇయ్యాల కూడా అంతే. ఆలస్యంగా వచ్చిన మేయర్ నేరుగా అధికారులకు మైక్ ఇచ్చారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగినట్లు కనిపిస్తోంది. కౌన్సిల్ స్టార్ట్ కాగానే క్లోజ్ చేశారు. చాలా ప్రశ్నలతో కౌన్సిల్ మీటింగ్‌కు వచ్చాం. ఒక అధికారి ఇంత ధైర్యంగా బాయ్‌కాట్ చేశారంటే, దీని వెనుక ప్రభుత్వ పెద్దల సపోర్టు ఉంది. అధికారులపై చర్యలు తీసుకోవాలి.
– విజయారెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్