రోడ్లపై చెత్త వేసినందుకు..10 రోజుల్లో రూ. 10 లక్షలకు పైగా ఫైన్

రోడ్లపై చెత్త వేసినందుకు..10 రోజుల్లో రూ. 10 లక్షలకు పైగా ఫైన్
  • 10 రోజుల్లో 259 మందికి చలాన్లు
  • రూ.10 లక్షలకు పైగా జరిమానాలు
  • అత్యధికంగా సీ అండ్​డీ వ్యర్థాలు పోస్తున్న 37 మందికి ఫైన్లు
  • డెబ్రిస్ కు రూ.25 వేల నుంచి రూ.2లక్షలు..
  • చెత్తకు రూ.500 నుంచి రూ.25 వేల వరకు ఫైన్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్లపై చెత్త వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ అధికారులు నిఘా పెడుతున్నారు. చెత్త, కన్ స్ట్రక్షన్ అండ్ డిమాలిష్(సీ అండ్ డీ) వ్యర్థాలు తెచ్చిపోస్తున్న వారికి చలాన్లతో జరిమానాలు విధిస్తున్నారు. గడిచిన 10 రోజుల్లో రూ.10 లక్షలకు పైగా జరిమానాలు విధించారు. అత్యధికంగా రోడ్లపై నిర్మాణ వ్యర్థాలు తెచ్చిపోస్తున్న 37 మందికి టౌన్ ప్లానింగ్ అధికారులు రూ.5.50 లక్షల ఫైన్లు వేశారు.  

ఇందులో 11 మంది నుంచి రూ.75 వేలు వసూలు చేశారు. రోడ్లపై చెత్త వేస్తున్న 222 మందికి రూ.5లక్షల41వేల200 చలాన్లు వేయగా, వీరిలోని 107 మంది నుంచి రూ.లక్షా22వేల900 వసూలు చేశారు. డెబ్రిస్ అయితే రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు, చెత్త అయితే రూ.500 నుంచి రూ.25 వేల వరకు ఫైన్లు వేస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన కాంప్రెహెన్సివ్ చలాన్ మేనేజ్ మెంట్ సిస్టం(సీసీఎంఎస్) యాప్ ద్వారా ఫైన్లు వేస్తున్నారు. 

ముందుగా సర్కిల్​స్థాయిలో.. 

ముందుగా సర్కిల్ స్థాయి అధికారులు చలాన్లు విధిస్తున్నారు. రెస్పాన్స్ ని బట్టి కింది స్థాయిలో శానిటరీ సూపర్ వైజర్లు, ఎస్ఎఫ్ఏలకు యాప్ లాగిన్లు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఫైన్లు వేయడమే కాకుండా వాటిని కలెక్ట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫీల్డ్ లో ఉండే వారు రెగ్యులర్ గా సంబంధిత చలాన్లను వసూళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా సీ అండ్ డీ వ్యర్థాల విషయంలో కమిషనర్ ఇలంబరితి సీరియస్ గా ఉన్నారు. ప్రధానంగా రోడ్లపై చెత్త వేస్తున్న వ్యాపారుల్లో మార్పు కనిపిస్తుంది. షాపుల ముందు చెత్త వేస్తే ఆ షాప్ ఓనర్ కి చలాన్లు వేస్తున్నారు. 

మార్పు కనిపించాలని కమిషనర్ ఆదేశాలు

రోడ్లపై చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేస్తున్న వారిలో మార్పు కనిపించాలని కమిషనర్ ఇలంబరితి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ డైలీ నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్పస్ లో ఈ అంశాలను అధికారులకు సూచిస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలు వేస్తున్న వారికి భారీగా చలాన్లు వేయాలని ఆదేశించారు. జరిమానాలు విధించిన వారిలో మార్పు కనిపిస్తుందా? లేదా అన్నదానిపై రివ్యూ చేస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలను సీ అండ్ డీ ప్లాంట్లకు మాత్రమే తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణా వ్యర్థాల విషయంలో చాలా సిరీయస్ గా ఉండాలని, వాటితో రోడ్లపై చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎప్పటికప్పుడు చెబుతున్నారు.