బీఆర్​ఎస్ ​హయాంలో జీహెచ్ఎంసీ అప్పు 6,880 కోట్లు..

బీఆర్​ఎస్ ​హయాంలో జీహెచ్ఎంసీ అప్పు 6,880 కోట్లు..
  • ఈ ఏడాదిలోనే రూ.వెయ్యి కోట్లు చెల్లింపు  
  • 2016కు ముందు జీహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్​
  • 2016 నుంచి 23 వరకు రూ.7 వేల కోట్ల అప్పులతో పనులు 
  • నెలకు రూ.45 కోట్ల వడ్డీ చెల్లింపు
  • ఐదారేండ్లలో బాకీలు తీర్చేలా ప్లాన్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులను బల్దియా తిరిగి చెల్లిస్తున్నది. 2016 నుంచి 2023 వరకు బల్దియా రూ.6,880 కోట్ల అప్పులు చేయగా,  కొత్తగా నయా పైసా అప్పు పుట్టని పరిస్థితి నెలకొన్నది. దీంతో షెడ్యూల్ ప్రకారం గతేడాది నుంచి బల్దియా రీ పేమెంట్ చేస్తున్నది. గ్రేటర్ లో చేపట్టిన పనులకు గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అప్పులు చేయించింది. తద్వారా వేల కోట్ల భారం బల్దియాపై పడింది.

ఇప్పటికే ఈ అప్పులకు సంబంధించి ప్రతినెలా రూ.45 కోట్ల వడ్డీని జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. అయితే, ఇప్పటివరకు బల్దియా తీసుకున్న ఐదు లోన్లకు సంబంధించి ఒక్కోదానికి ఒక్కో విధంగా రీ పేమెంట్ షెడ్యూల్ ఉంది. గతేడాది అక్టోబర్ నుంచి సీఆర్ఎంపీ, ఎస్ఎన్డీపీ(స్టాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం) కోసం లోన్ల రీ పేమెంట్ మొదలైంది. అదేవిధంగా ఎస్ఆర్డీపీ కోసం చేసిన అప్పులకు సంబంధించి ఈ ఏడాది జనవరి నుంచి రీ పేమెంట్ స్టార్టయ్యింది. ప్రతి మూడునెలలకోసారి ఈ రీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు హడ్కో లోన్ రీ పేమెంట్ కూడా రూ.2.5 కోట్లు చెల్లిస్తోంది. ఇలా గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్లను జీహెచ్ఎంసీ తెరిగి చెల్లించింది.  

2016 వరకు బల్దియాకే వడ్డీ వచ్చేది..

జీహెచ్ఎంసీ ఇప్పటివరకు చేసిన అప్పులను షెడ్యూల్ ప్రకారం తిరిగి చెల్లిస్తే ఐదారేండ్లలో తీరే అవకాశం ఉంటుంది. అయితే, అప్పుల్లోంచి గట్టెక్కాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా నిధులు అందజేసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 2016 వరకు బల్దియా మిగులు నిధులతో ఉండేది. ఈ ఫండ్స్​ద్వారా బల్దియా ఖజానాకు వడ్డీ కూడా వచ్చేది. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్​ప్రభుత్వం జీహెచ్ఎంసీని పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.

పైగా అప్పులు చేసి పనులు చేసింది. నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్ల కోసమే రూ.4,250 కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేసుకుంటూ పోయారే తప్పితే ప్రభుత్వం నుంచి నిధులు మాత్రం ఇవ్వలేదు. గతేడాది కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే బల్దియా అప్పులు భారంతో కనిపించింది. కొత్త పనులు చేద్దామన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో పాటు కొత్తగా పనులు చేయాలంటే రూ.5 వేల కోట్లు అవసరం ఉంటుందని అధికారుల అంచనా.  

పదేండ్లుగా ఆపేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ 

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి బల్దియాకు రూ.3,141 కోట్లు రావాల్సి ఉన్నా ఇవ్వడం లేదు. స్టాంప్​డ్యూటీ కింద రావాల్సిన రూ.3 వేల కోట్లను పదేండ్లుగా ఇవ్వట్లేదు. దీనిపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా గత బీఆర్ఎస్​ప్రభుత్వం స్పందించలేదు. దీంతో నగర పారిశుధ్యం, వివిధ పథకాల అమలు భారంగా మారుతోంది. అలాగే మ్యుటేషన్ ఫీజులకి సంబంధించి గతంలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే జీహెచ్ఎంసీ ఖాతాలో జమయ్యేది. కానీ, రెండేండ్ల కింద నేరుగా  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్లిన తర్వాతే వారు జీహెచ్ఎంసీకి ఇచ్చేలా కొత్త విధానాన్ని తెచ్చారు. దీనివల్ల మ్యుటేషన్ బకాయిలు పేరుకుపోతున్నాయి.

రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అమ్మకం, కొనుగోలుదారుల నుంచి ఆ శాఖ ఫీజులు కలెక్ట్ చేస్తున్నప్పటికీ బల్దియాకు రావాల్సిన వాటా ఇవ్వడంలేదు. ప్రభుత్వ మారడంతో ఆ డబ్బులు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు లెటర్​రాసింది. మ్యుటేషన్ ఫీజు రూ.175 కోట్లు కాగా, ఈ నిధులను ఇచ్చేందుకు మూడునెలల క్రితం ముందుకొచ్చింది. ఇందులో రూ.39 కోట్లు జీహెచ్ఎంసీకి చెల్లించింది. మిగతా నిధులు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది.  ఒకవైపు బల్దియా అప్పులు తిరిగి చెల్లిస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. ఈ నిధులైనా ఇస్తే కొత్తగా చేపట్టే పనులు సాఫీగా సాగనున్నాయి.

రూ.6,880 కోట్ల అప్పు ఇలా..

బల్దియా ఇప్పటికే వివిధ పనుల కోసం ఎస్బీఐలో రూ.6,880 కోట్ల అప్పు చేసింది. స్ట్రాటజిక్​రోడ్​డెవలప్ మెంట్​ప్రొగ్రాం(ఎస్ఆర్డీపీ) కోసం రూ.4,250 కోట్ల అప్పు చేసింది. ఇందులో బాండ్ల ద్వారా రూ.495 కోట్లు తీసుకుంది. రూ.200 కోట్లు 8.90 శాతం వడ్డీకి, రూ.195 కోట్లు 9.38 శాతం, రూ.100 కోట్లు 10.23 శాతం వడ్డీకి తీసుకుంది. మరో రూ.2500 కోట్లను 8.65 శాతం వడ్డీకి రూపీ టర్న్ లోన్​తీసుకుంది. మరోసారి రూ.505 కోట్లను 7.75 శాతం వడ్డీకి తీసుకుంది. వీటితో పాటు మరో రూ.750 కోట్లను తీసుకుంది.

కాంప్రెన్సివ్​రోడ్​మెయింటెనెన్స్​ప్రొగ్రాం(సీఆర్ఎంపీ) కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1460 కోట్లు, ఎస్ఎన్డీపీ కోసం రూ.680 కోట్లను 7.20 శాతం వడ్డీకి తీసుకుంది. జేఎన్ఎన్​యూఆర్ఎం ఇండ్లకోసం రూ.140 కోట్ల హడ్కో లోన్ తీసుకోగా, రూ.100 కోట్లను 8.90 శాతం వడ్డీకి, రూ.40 కోట్లను 9.90 శాతం వడ్డీకి తీసుకుంది. వీటితో పాటు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల కోసం ట్రేడ్స్ ద్వారా రూ.350 కోట్ల అప్పు చేసింది. రూ.6,880 కోట్లలో వెయ్యికోట్లు తిరిగి చెల్లించడంతో అందుకు సంబంధించిన వడ్డీ కూడా తగ్గింది.