మన మూడంచల పాలనలో చివరిదైన గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు సరిపోను నిధులు, అధికారాలు లేక ప్రజలకు కావాల్సిన పౌరసేవలు అందించడం లేదు. 73,74వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు చాలా విషయాల్లో అధికారాలు కల్పించినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. స్థానిక సంస్థలు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల విభజన కోసం రాజ్యాంగంలోని 280 అనుకరణ ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) ఏర్పాటైంది. ఈ ఆర్థిక సంఘం రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పన్నుల్లో కొంత శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని సూచించింది. కేంద్ర నిధుల్లో 40 శాతం నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలని ప్రస్తుత కేంద్ర15వ ఆర్థిక సంఘం సూచించింది. అలాగే రాష్ట్రంలోని పన్నులను స్థానిక సంస్థలకు పంచడానికి రాజ్యాంగం అనుకరణ 243ఐ ద్వారా రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటవుతుంది. ఈ ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పంచాయతీ, మున్సిపాలిటీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర బడ్జెట్ లో కొంత శాతం స్థానిక సంస్థలకు కేటాయించాలని రాష్ట్ర గవర్నర్కు నివేదిక ఇస్తుంది. ఈ నివేదికను రాష్ట్ర గవర్నర్ చర్చ కోసం రాష్ట్ర అసెంబ్లీ ముందు ఉంచుతారు. అంటే స్థానిక సంస్థలకు హక్కుగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో కొంత భాగం బదలాయించాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థలకు నిధులేవి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ఆర్థిక సంఘం ఇచ్చిన ఒక్క నివేదికపై కూడా అసెంబ్లీలో చర్చ జరగలేదు. స్థానిక సంస్థలకు ఒక హక్కుగా నిధులు విడుదల కాలేదు. చాలా సందర్భాల్లో స్థానికంగా పనులు చేసి నిధులు రాక సర్పంచులు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్న తీరు కనిపిస్తున్నవే. చేసిన పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఇటీవల ఓ సర్పంచ్ బిచ్చమెత్తుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. గత అర్ధ శతాబ్దిలో హైదరాబాద్ నగర జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా అవసరాలకు సరిపడా పౌరసేవలు అందడం లేదు. ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు, పార్కులు వంటివి నగరపాలక సంస్థ ఏర్పాటు చేయలేకపోయింది. రాష్ట్ర జానాభాలో సుమారు30 శాతం మంది ప్రజలు హైదరాబాదులోనే నివసిస్తున్నారు. అదీగాక రాష్ట్ర సంపద ఉత్పత్తిలో ఎక్కువ శాతం వరకు హైదరాబాదు నగరం నుంచే వస్తోంది. మున్సిపల్ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని, అలాగే పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడానికి ప్రతివార్డులో స్థానికులతో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని రాజ్యాంగ అనుకరణ 243 ‘ఎస్’ చెపుతోంది. గత మూడు సంవత్సరాలుగా జీహెచ్ఎంసీలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయలేదు. సాధారణంగా ఏ మున్సిపాలిటీకైనా ఆస్తి పన్ను ప్రధాన ఆదాయ వనరు. కొన్ని ప్రాంతాలు మినహా హైదరాబాద్ ప్రజలు క్రమం తప్పకుండా ఆస్తి పన్ను చెల్లిస్తారు. పన్ను బకాయిలకు 24 శాతం వడ్డీ వేసి వసూలు చేస్తారు. ఇవన్నీ సామాన్య ప్రజలకు మాత్రమే. ఇక ప్రభుత్వ ఆస్తులపై ఆస్తిపన్ను విషయానికొస్తే పరిస్థితి మరోలా ఉంటోంది.
జనానికి సౌలత్ లు అందక..
ఒకప్పుడు సుందరనగరంగా పేరొందిన హైదరాబాద్సిటీలో ఎక్కడ చూసినా.. గతుకుల రోడ్లు, పొంగిపొర్లుతున్న మురికి కాలువలు కనిపిస్తున్నాయి. తాగునీటి వంటి సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాజ్యాంగం స్థానిక సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినా.. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో అవి ఉత్సవ విగ్రహాలుగా మారే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్మహానగర పాలక సంస్థ పరిస్థితి నిధులు లేక దారుణంగా తయారైంది. జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ రూ. 6,150 కోట్లు కాగా, ముంబయి మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ రూ.46 వేల కోట్లు, బెంగళూరు మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ రూ.9,300 కోట్లుగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు1500 గుర్తింపు పొందిన మురికివాడలు ఉన్నాయి. మరో1500 వరకు గుర్తింపు పొందనివి ఉన్నాయి. ఈ మురికివాడల్లో 4 లక్షల కుటుంబాలు అంటే సుమారు 20 లక్షల జనాభా అత్యంత దయనీయస్థితిలో కాలం వెళ్లదీస్తోంది. నిధుల లేమితో జీహెచ్‌ఎంసీ మురికివాడల్లో సరైన సౌలత్లు ఏర్పాటు చేయలేకపోతోంది. జనానికి కనీస పౌరసేవలు అందడం లేదు. డ్రైనేజీ, చెత్త, వ్యర్థాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా జీహెచ్ఎంసీకి రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన నిధులు విడుదల చేయాలి. ప్రభుత్వ పన్ను బకాయిలు వెంటనే చెల్లించి.. మహానగర పాలక సంస్థను అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి.
పెరిగిపోయిన బకాయిలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఏ ప్రభుత్వ శాఖ కూడా నగరపాలక సంస్థకు రూపాయి కూడా పన్ను చెల్లించలేదంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులపై రూ. 5,258 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి రూ.306 కోట్లు సర్కారు జీహెచ్ఎంసీకి బకాయి ఉన్నట్లు తేలింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రూ.281 కోట్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రూ. 90 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉందని తెలుస్తోంది. ఒక పక్క జీహెచ్ఎంసీకి ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సిన నిధులు రాకపోగా, మరోపక్క రాష్ట్ర సర్కారు రూ. 5,564 కోట్ల మేర పన్ను బకాయిలు చెల్లించడం లేదు. దీంతో బీహెచ్‌ఎంసీ ఆదాయం లేక, సర్కారు నుంచి పన్నులు వసూలు గాక అప్పుల ఊబిలో కూరుకుపోయింది. - ఎం. పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్గుడ్గవర్నెన్స్
ఇవి కూడా చదవండి