జూబ్లీహిల్స్​లో రూ. 250 కోట్ల ల్యాండ్ కబ్జా..

జూబ్లీహిల్స్​లో రూ. 250 కోట్ల ల్యాండ్ కబ్జా..
  • 1,260 గజాల స్థలంలో కట్టడాలు
  • జేసీబీతో నిర్మాణాలు కూల్చేయించిన మేయర్

హైదరాబాద్ సిటీ/ జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో కబ్జాకు గురైన 1,260 చదరపు గజాల స్థలాన్ని జీహెచ్​ఎంసీ స్వాధీనం చేసుకున్నది. ఈ ల్యాండ్ విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుంది. పోలీస్​స్టేషన్ వెనుక జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ లే అవుట్​లో ఈ జాగా ఉంది. అందులో జీహెచ్​ఎంసీకి చెందిన 1,260 చదరపు గజాల స్థలం కబ్జాకు గురైనట్లు తెలుసుకున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి.. సోమవారం స్వయంగా వెళ్లి పరిశీలించారు.

ముగ్గురు కలిసి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నట్లు గుర్తించారు. వెంటనే జేసీబీ సహాయంతో దగ్గరుండి అక్రమ నిర్మాణాలను కూల్చి వేయించారు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ ల్యాండ్​ను అక్కడ ఉన్నవాళ్లు సర్వీస్ రోడ్డు మాదిరి ఉపయోగించుకుంటున్నారు. వరదలు వచ్చినప్పుడు లే అవుట్​లోని వాళ్లు మెయిన్ రోడ్లపై నడిచే పరిస్థితి ఉండదు.

అలాంటప్పుడు ఈ ల్యాండ్​పై నుంచే రాకపోకలు కొనసాగించేవాళ్లు. అయితే, ఈ స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి దృష్టికి వచ్చింది. దీంతో ఆమె సోమవారం ఉదయం జీహెచ్​ఎంసీ అధికారులతో కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురిలో ఒకరు కూరగాయలు, పండ్ల చెట్లు నాటగా.. మరొకరు గార్డెన్ ఏర్పాటు చేసి కాంపౌండ్ వాల్ కట్టుకున్నాడు. ఇంకొకరు ఏకంగా ఓ గదినే నిర్మించినట్లు మేయర్ గుర్తించారు. జీహెచ్​ఎంసీ బోర్డును కూడా తొలగించారు.

కూరగాయలు పండిస్తున్న వ్యక్తి ఫ్లాట్.. ఈ ఖాళీ స్థలం పక్కనే ఉంది. ఇక్కడ కూరగాయలు పండించేందుకు తన సరిహద్దులో పెద్ద కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నాడు. అక్కడ నిచ్చెన వేసుకుని పార్క్​లోకి దిగి కూరగాయలు పండిస్తున్నాడు. కబ్జాకు గురైన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను మేయర్ అక్కడే ఆదేశించారు. సాయంత్రం అధికారులు జేసీబీతో కాంపౌండ్ వాల్ తొలగించారు. మంగళవారం రూమ్​ను కూల్చేసి మొత్తం స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. అయితే.. కబ్జాదారులపై చర్యలు తీసుకునేందుకు జీహెచ్​ఎంసీ నిర్ణయించారు.