గ్రేటర్ హైదరాబాద్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ గా మారింది. సిటీలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. పట్టించుకునేవారే కరువయ్యారు. నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్లకు అలవాటుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సిటీలో అక్రమ నిర్మాణాల విషయంలో జీహెచ్ఎంసీని మందలించింది హైకోర్టు. దీంతో బల్దియా బాస్ దాన కిశోర్ సీరియస్ గా ఉన్నారు. అనుమతులకు మించి నిర్మాణాలు చేపడితే కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు.. గత మూడు రోజులుగా నగరంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ప్రతి సర్కిల్ లో వీటిని గుర్తించి..కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా నగరంలో 95 బిల్డింగ్స్ కూల్చివేసినట్లు అధికారులు చెబుతున్నారు.
సిటీలో భూమి విలువ పెరగడంతో అక్రమ నిర్మాణాలు భారీగా జరుగుతున్నట్లు బల్దియా భావిస్తోంది. అయితే ఎవరైనా అపార్ట్ మెంట్లో ఫ్లాట్ బుక్ చేసుకునే ముందు… పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలనీ… చాలా మంది బిల్డర్ల చేతులో మోసపోతున్నారని అధికారులు చెబుతున్నారు. నెలలో మూడు రోజులపాటు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు డ్రైవ్ చేస్తామని చెబుతున్నారు. మరోవైపు ఈ నిర్మాణాలకు సహకరించిన సిబ్బందిని గుర్తించే పనిలో పడ్డారు బల్దియా బాస్ దానకిశోర్. ఇప్పటికే సిటీలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలున్న కూకట్ పల్లి, ఎల్బీనగర్, ఓల్డ్ సిటీలను ఐడెంటీఫై చేశారు. ఈ ఏరియాల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందికి త్వరలోనే చార్జ్ మెమో ఇవ్వనున్నట్లు సమాచారం.