- నిర్వహణను పట్టించుకోని బల్దియా అధికారులు
- నిరుపయోగంగా ఎక్విప్ మెంట్స్
- వింటర్ సీజన్ కావడంతో ఫిట్‌నెస్‌పై సిటిజన్ల ఫోకస్
- సరైన ఫెసిలిటీస్ లేకపోవడంతో ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌లోని ఓపెన్, కమ్యూనిటీ హాల్స్ లోని ఫ్రీ జిమ్ లను బల్దియా పట్టించుకోవడం లేదు. అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇది వరకే ఉన్న జిమ్‌ల మెయింటెనెన్స్‌ను కూడా గాలికొదిలేసింది. దీంతో జిమ్‌లలో కొన్ని ఎక్విప్ మెంట్స్ పూర్తిగా పనికి రాకుండా పోతున్నాయి. రోజురోజుకి ఒక్కో ఎక్విప్ మెంట్ పాడవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం చాలా చోట్ల బల్దియా ఏర్పాటు చేసిన ఫ్రీ జిమ్‌లు నిరుపయోగంగా ఉన్నాయి. పాడైన ఎక్విప్మెంట్ల స్థానంలో కొత్త వాటిని అందుబాటులో ఉంచడం లేదు. వింటర్ సీజన్ కావడంతో సిటిజన్లు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టారు. కొందరు ఫిట్నెస్ కోసం నెలకు రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పైగా చెల్లించి జిమ్‌లకు వెళ్తుండగా.. ఆ స్తోమత లేని వారు బల్దియా ఏర్పాటు చేసిన ఫ్రీ జిమ్‌లకు వస్తున్నారు. అక్కడ వర్కౌట్లు చేయాలని అనుకుంటున్నప్పటికీ సరైన ఎక్విప్ మెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో ఫ్రీ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని అప్పట్లో అధికార పార్టీ నేతలు చెప్పినప్పటికీ కొన్నాళ్లకే అవి మూలనపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ తాళం వేసే కనిపిస్తున్నాయి. కనీసం ఫిట్ నెస్ ట్రైనర్లను అయినా నియమించి ఉంటే ఈ జిమ్‌లు ఉపయోగకరంగా ఉండేవని సిటిజన్లు అంటున్నారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులను వివరణ అడిగితే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు.
6 పార్కుల్లో ఓపెన్ జిమ్‌లు
ఏఎస్రావు నగర్ పార్కు, ఇమ్లిబన్ పార్క్, యూసుఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్కు, శేరిలింగంపల్లిలోని గుల్ మెహర్ పార్కు, సికింద్రాబాద్‌లోని నెహ్రూనగర్ పార్కుతో పాటు ఇందిరాపార్కులో జీహెచ్ఎంసీ 6 ఓపెన్ జిమ్‌లను 2016లో ఏర్పాటు చేసింది. వీటితో పాటు 135 ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాల్స్ లో ఫ్రీ జిమ్ లను 2017లో ఏర్పాటు చేసింది. కమ్యూనిటీ హాల్స్ లోని జిమ్ లో అప్పట్లో అన్ని రకాల వస్తువులను అందుబాటులో ఉంచారు. కానీ ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో బల్దియా ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ జిమ్‌లు జనానికి ఉపయోగపడట్లేదు. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది జిమ్ఎక్విప్మెంట్ను రూమ్‌లో పెట్టి తాళాలు వేశారు. అన్నిచోట్లా ఫ్రీ జిమ్‌లను టైమ్‌కి తెరవాలని, వాటిల్లో అన్ని రకాల ఫిట్ నెస్ ఎక్విప్ మెంట్లను ఉంచాలని సిటిజన్లు కోరుతున్నారు.
ఎప్పుడు తెరుస్తరో తెలియట్లే..
కమ్యూనిటీ హాల్స్‌లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన జిమ్‌లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. వర్కౌట్లు చేసేందుకు కావాల్సిన ఎక్విప్ మెంట్స్ లేవు. దీంతో యూత్ ఎవరూ అక్కడకి వెళ్లడం లేదు. ముందుగానే జిమ్ కోచ్‌లను నియమించి ఉంటే బాగుండేది. లేకపోతే ఇలాంటి జిమ్‌లను ఏర్పాటు చేయకపోవడమే బెటర్.
- జె. సుధాకర్, లంగర్‌హౌస్
ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేయాలె
ఎన్టీఆర్ స్టేడియానికి డైలీ స్టూడెంట్స్ తో పాటు మార్నింగ్, ఈవెనింగ్ వాకింగ్ కోసం చాలామంది వస్తారు. ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పక్కనే ఉన్న ఇందిరా పార్కులో ఓపెన్ జిమ్ ఉంది. కానీ ఇందిరా పార్కుకు ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉండటంతో అక్కడికి ఎవరూ వెళ్లడం లేదు. అన్ని రకాల ఎక్విప్ మెంట్లతో ఎన్టీఆర్ స్టేడియంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి.
- సాయి కుమార్, స్టూడెంట్, దోమలగూడ