హైదరాబాద్, వెలుగు: మ్యాన్‌హోళ్లు మంచిగా లేకపోవడంతో గ్రేటర్ లో వర్షం కురిసిన ప్రతిసారి రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు వెళ్లే మార్గం లేక మోకాలు లోతు నీళ్లు నిలుస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,295 కిలో మీటర్ల మేర వరదనీటి కాల్వలు ఉన్నాయి. వీటిపై 3.70 లక్షల మ్యాన్ హోళ్లుఉన్నాయి. రోడ్ల పడే ప్రతి చినుకు వీటి గుండా వెళ్లాల్సి ఉంది. అయితే బల్దియా అధికారులు మ్యాన్‌హోళ్ల మెయింటెనెన్స్ ను పట్టించుకోకపోవడంతో వరద నీరు రోడ్లపైనే నిలుస్తోంది. పూర్తిగా ధ్వంసమైన వాటిని కూడా రిపేర్చేయడం లేదు. మూతలు విరిగిపోయిన చోట కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. తరచూ ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్లు, బస్టాపుల సమీపంలోని మ్యాన్ హోళ్లు డేంజరస్‌గా మారాయి. కొన్నిచోట్ల మూతులు విరిగిపోయి ఉండగా, మరికొన్నిచోట్ల మొత్తానికే లేవు.
చెబుతున్నారే తప్ప.. చేస్తలేరు
వానా కాలానికి ముందు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం జరగడం లేదు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్ల జీతాల్లో కోత విధించినా చాలా మందిలో మార్పు రావడం లేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కార్వాన్, టోలిచౌకి, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, లంగర్ హౌస్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లుడ్యామేజ్అయినా, మూతలు లేకపోయినా రిపేర్లు చేయడం లేదు.
ట్రాఫిక్ జామ్ కి ఇదే కారణం
వర్షం కురిసిన ప్రతిసారి కొన్నిచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షపు నీరు పైపులైన్ల ద్వారా సాఫీగా వెళ్లకపోవడంతోనే ఈ సమస్య ఉంటోంది. లక్డీకాపూల్, టోలిచౌకి, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్, నల్లకుంట, ఎల్బీనగర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కు ఇదే ప్రధాన కారణం. దాదాపు 50 వేల వరదనీటి మ్యాన్ హోళ్లుఉన్నా ఉపయోగపడడం లేదు. మూతలు సగం విరిగిపోయి, కొన్నిచోట్ల మూతలపై ఉన్న హోళ్లు బ్లాక్ అయ్యి నీళ్లు వెళ్లేందుకు వీలు ఉండడం లేదు.
రూ.15 కోట్లతో పనులు
నాలుగేండ్ల కింద మెయిన్ రోడ్లపై ఉన్న వరద నీటి మ్యాన్ హోళ్ల ఎత్తును పెంచారు. ఆ పనులకు రూ.15 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత మళ్లీ కొత్తగా వేశారు. కానీ మ్యాన్‌హోళ్ల ఎత్తు పెంచకుండా వదిలేశారు. దీంతో ఆయా చోట్ల డ్యామేజ్ అవుతున్నాయి. ఐరన్ గ్రిల్స్ఏర్పాటు చేసిన చోట మాత్రమే కాస్తా బెటర్ గా ఉన్నాయి. సిమెంట్‌తో ఏర్పాటు చేసినవి కొన్నాళ్లకే డ్యామేజ్అవుతున్నాయి.
పూర్తిగా ధ్వంసమైనా పట్టించుకుంటలే
మెయిన్ రోడ్లపై ఉన్న మ్యాన్ హోల్స్ పూర్తిగా పాడైనా ఎలాంటి రిపేర్లు చేయడం లేదు. మూతలు పూర్తిగా డ్యామేజీ అయినా కొత్త వాటిని ఏర్పాటు చేయట్లేదు. స్కూల్స్, బస్టాపుల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు.
సుధాకర్, లంగర్ హౌస్
గంటలపాటు రోడ్ల మీదనే నీళ్లు
రోడ్లపై ఏర్పాటు చేసిన మ్యాన్ హోళ్లతో ఉపయోగం ఉండడం లేదు. ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉండడంతో వరద నీరు వాటి గుండా వెళ్లట్లేదు. చాలాచోట్ల మ్యాన్ హోల్స్ పై మూతలే ఉండడం లేదు. వర్షం కురిసిన టైంలో వరద క్లియర్ అవడానికి గంటలు పడుతోంది.
- బాలాజీ, రెడ్ హిల్స్