హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది కురిసిన వానలకు గ్రేటర్ పరిధిలోని అన్ని చెరువులు నిండి కళకళలాడుతున్నాయి. కానీ వాటి మెయింటెనెన్స్ ను మాత్రం జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికే చాలా చెరువులు కబ్జాలకు గురయ్యాయి. పరిరక్షణకు సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా కొన్నింటి వద్ద ఎవరూ కనిపించడంలేదు. దీంతో అవి ఆక్రమణకు గురవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల జరిగిన బల్దియా కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే చెరువులకు రిపేర్లు, బ్యూటిఫికేషన్ అంటూ రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా చాలా చోట్ల పనులే జరగడం లేదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు చెరువుల సంరక్షణ బాధ్యతలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పగా.. జనవాసాలకు దగ్గరలో ఉన్న చెరువుల బ్యూటిఫికేషన్ కే ఆ సంస్థలు ఇంట్రెస్ట్చూపిస్తున్నాయి.
బ్యూటిఫికేషన్ పేరుతో రూ.481 కోట్ల ఖర్చు
గ్రేటర్ లో ఉన్న చెరువుల చుట్టూ కంచె ఏర్పాటు, మురుగునీటి మళ్లింపు, వాకింగ్ ట్రాక్, ఎలక్ట్రికల్ లైటింగ్ తదితర పనుల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే రూ.481 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో గతేడాది అత్యవసర రిపేర్ల కోసం రూ.9.42 కోట్లు, మరో రూ.94.17 కోట్లతో 63 చెరువుల వద్ద వివిధ పనులు చేపట్టింది. రూ.282 కోట్ల మిషన్ కాకతీయ నిధులతో 19 చెరువుల పనులు చేపట్టారు. ఇటీవల రూ.95.54 కోట్లతో 61 చెరువులకు వెళ్లే రోడ్డు మార్గాలను బాగుచేసేందుకు ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. శేరిలింగంపల్లిలోని గోపన్ పల్లి కోమటి కొండ చెరువు, గోసాయి కుంట చెరువు, కుత్బుల్లాపూర్ లోని నంద నగర్ హెచ్ఎంటీ లేక్, శేరిలింగంపల్లి లోని లింగంపల్లి గోపి చెరువుతోపాటు మరికొన్నింటికి అలుగు, తూముల పనులతో పాటు బ్యూటిఫికేషన్ కోసం కోట్లు ఖర్చుపెడుతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
అభ్యంతరాలు వచ్చాయంటూ కొన్నింటికే ఫెన్సింగ్
గతేడాది వర్షాల సమయంలో అన్ని చెరువుల ఎఫ్ టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్)బౌండరీలను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పటివరకు పనులు పూర్తి చేయలేదు. గతంలో 157 చెరువుల ఎఫ్ టీఎల్హద్దులను గుర్తించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ 52 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ పూర్తయింది. దీంతో వీటికి మత్రమే ఫెన్సింగ్ఏర్పాటు చేశారు. అవి తమ భూములని స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయంటూ మిగతా 105 చెరువులను వదిలేశారు. వీటికి సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
ప్రత్యేక కమిషనర్‌ను నియమించట్లే
చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు జీహెచ్ఎంసీలో స్పెషల్ కమిషనర్ ను నియమిస్తామని 2020 సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్ చెప్పినా నేటికీ అపాయింట్చేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 200 చెరువుల లెక్కదొరకని పరిస్థితి నెలకొంది. గతంలో వెయ్యి వరకు చెరువులు ఉండగా, ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం కేవలం185 చెరువులు మాత్రమే మిగిలాయి. ఇప్పటికైనా ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యతలు అప్పగిస్తే వీటినైనా కాపాడుకోవచ్చని నిపుణులు అభిప్రాపడుతున్నారు.
కబ్జాలను అడ్డుకోవాలి
అధికారంలో ఉన్న నాయకులే చెరువుల కబ్జాలకు పాల్పడుతున్నారు. దీన్ని అడ్డుకోకపోతే చెరువులు కనిపించకుండాపోయే ప్రమాదం ఉంది. చెరువుల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలె. వాటి రిపేర్లు, బ్యూటిఫికేషన్ కోసం ఖర్చు చేస్తున్న డబ్బులపై పూర్తి వివరాలు జనాలకు తెలియజేయాలె.
- దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త
డైలీ ఫిర్యాదులు..
గుర్రం చెరువు, దుర్గం చెరువు, సరూర్ నగర్ చెరువు, బతుకమ్మ చెరువు, తీగలసాగర్ చెరువు, రాయసముద్రం చెరువు, చందం చెరువు, సాకి చెరువు, సూరారం పెద్ద చెరువు, తిమ్మక్క చెరువు, అప్పా చెరువు, పల్లె చెరువు, బాలాపూర్ పెద్దచెరువులతో సహా అనేక ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణలతో నామమాత్రంగా మిగిలాయి. ఈ కబ్జాల గురించి వాటిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని నేరుగా, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. రాజేంద్రనగర్ పరిధిలోని పెద్దతాళ్లకుంట చెరువును జీహెచ్ఎంసీ పట్టించుకోవడంలేదని స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నాలుగురోజుల కిందట మంత్రి కేటీఆర్ తో పాటు బల్దియా అధికారులకు ట్వీట్ చేశారు. అలాగే కూకట్‌పల్లిలోని కాముని చెరువుని కాపాడాలని సుధాకర్ అనే సిటిజన్ రెండ్రోజుల కిందట అధికారులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయగా, ఇదే చెరువు గురించి మరొకరు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.