హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో చెరువుల నిర్వహణను జీహెచ్ఎంసీ అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం దాదాపు చెరువులన్నీ నీటితో నిండి ఉన్నాయి. కొన్నింటిలో మాత్రమే నీరు తక్కువగా ఉంది. భారీ వర్షాలు కురిస్తే చెరువుల్లోని నీరు బయటికి వెళ్లే దారి కనిపించడం లేదు. గడిచిన రెండేళ్లలో చెరువులు పొంగడంతోనే కాలనీలు నీట మునిగాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎఫ్టీఎల్ కంటే రెండు, మూడు ఫీట్ల కిందకు నీటిని మెయింటెన్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అలా చేయడం లేదు. అవసరమైన చోట మోటార్లు అందుబాటులో ఉంచుతామని చెప్పి పట్టించుకోవడం లేదు. ఇక చెరువుల పరిరక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. గతేడాది వానల టైంలో చెరువుల హద్దులు గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆ పనులు పూర్తి చేయలేదు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా మొత్తం 185 చెరువుల్లో 157 చెరువుల ఎఫ్ టీఎల్ హద్దులు గుర్తించాలని గతేడాది నిర్ణయించారు. 52 చెరువులకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ పూర్తయింది. ఫైనల్ అయిన చెరువులకు మత్రమే అధికారులు ఫెన్సింగ్ఏర్పాటు చేశారు. మిగతా చెరువుల సమీపంలోని స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయంటూ వదిలిపెట్టారు. చెరువుల్లో మురుగు నీరు మళ్లించడంతోపాటు వాటి పునరుద్ధరణ, కట్టల బాగుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్లతో 16 పనులు మంజూరు చేశారు. కానీ చేయలేదు.
దాదాపుగా అన్నీ అంతే
గతంలో కురిసిన వానలకు సిటీని వరదలు ముంచెత్తగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 500లకుపైగా కాలనీలు నీట మునిగాయి. వానలు ఆగిన మూడు వారాలకు కూడా కాలనీలను వరద వదల్లేదు. టోలిచౌకి నదీంకాలనీ, చాంద్రాయణగుట్ట అల్ జుబైర్ కాలనీలతోపాటు అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. గుర్రం చెరువు, దుర్గం చెరువు, సరూర్ నగర్ చెరువు, బతుకమ్మ చెరువు, తీగలసాగర్ చెరువు, రాయసముద్రం చెరువు, చందం చెరువు, సాకి చెరువు, తిమ్మక్క చెరువు, అప్పా చెరువు, పల్లె చెరువు, బాలాపూర్ పెద్దచెరువు సహా అనేక ప్రాంతాల్లోని చెరువులు ఆక్రమణకు గురై నామమాత్రంగా మిగిలాయి. మూసీ పరివాహక ప్రాంతంలో 6,350 ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వానలు కురిసిన టైంలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం చాలా చెరువులు నిండుకుండలా ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే పొంగిపొర్లడం తప్ప వేరే దారి కనిపించడం లేదు.
రూ.481 కోట్లు ఖర్చు
చెరువుల చుట్టూ కంచె, వాకింగ్ ట్రాక్, లైటింగ్ ఏర్పాటు, మురుగునీటి మళ్లింపు, ఇతర ప్రజా సౌకర్యాల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటివరకు రూ.481 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.282 కోట్ల మిషన్ కాకతీయ నిధులతో 19 చెరువుల వద్ద పనులు చేసింది. రెండేళ్ల కిందట అత్యవసర రిపేర్ల పేరుతో రూ.9.42 కోట్లు, గతేడాది మరో రూ.94.17 కోట్లతో 63 చెరువుల వద్ద వివిధ రకాల పనులు చేపట్టింది. మరో రూ.95.54 కోట్లతో 61 చెరువులకు వెళ్లే రోడ్లను బాగుచేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ ఎంతమేర పనులు చేశారన్న దానిపై క్లారిటీ లేదు. ఇలా వందల కోట్లు ఖర్చు పెడుతున్నా చెరువుల్లో పెద్దగా మార్పులు కనపడటం లేదు. మెయిన్రోడ్ల పక్కన ఉన్న ఒకటి, రెండు మినహా ఏ చెరువు వద్దకు వెళ్లి చూసినా సౌకర్యాలు కనిపించడం లేదు. తమ ప్రాంతంలోని చెరువులను కాపాడాలంటూ జీహెచ్ఎంసీ ఆఫీసులకు రెగ్యులర్గా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.
కార్పొరేట్ కంపెనీలకు అప్పగింత
సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద కార్పొరేట్సంస్థలకు సిటీలోని చెరువులను అప్పగించి జీహెచ్ఎంసీ చేతులు దులుపుకుంటోంది. ఇప్పటివరకు మొత్తం 14 చెరువులను సీఎస్ఆర్ కింద డెవలప్చేయమని అప్పగించింది. మరో 26 చెరువులను ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. కానీ బల్దియా మాత్రం సొంతంగా డెవలప్ చేయడం లేదు. అయితే కార్పొరేట్ సంస్థలు కేవలం మెయిన్రోడ్లు, రద్దీ ప్రాంతాల్లోని చెరువులను మాత్రమే తీసుకుంటున్నాయి. లోపల ఉన్నవాటిని పట్టించుకోవడం లేదు.