- గ్రేటర్‌లో పంపిణీకి సిద్ధంగా 70 వేల ఇండ్లు
- ఒక్క హైదరాబాద్ జిల్లాలో 7,500 మంది ఎంపిక
- లాటరీలో పేర్లు వచ్చిన వారికి సమాచారం ఇవ్వట్లే
- ఎక్కడ కేటాయిస్తారో చెప్పలేకపోతున్న అధికారులు
- మొదటి విడత లాటరీలో పేరువచ్చిన లబ్ధిదారుల్లో టెన్షన్
- ఇండ్ల కోసం కలెక్టరేట్ల చుట్టూ దరఖాస్తుదారుల చక్కర్లు
హైదరాబాద్, వెలుగు:డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లాటరీలో ఎంపికైన లబ్ధిదారులతో పాటు దరఖాస్తుదారుల్లోనూ ఆందోళన నెలకొంది. గ్రేటర్‌లో పంపిణీకి 70 వేల ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని, అక్టోబర్ మూడోవారం వరకు వాటిని అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించినది తెలిసిందే. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ అంటూ నాలుగు రోజుల కిందట హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో 7,500 మంది లబ్ధిదారులను ఆన్‌లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఒక్కో నియోజకవర్గానికి 500 మందికి కేటాయించారు. ఎంపికైన వారికి 8 ప్రాంతాల్లో ఇండ్లను పంపిణీ చేస్తామని ప్రకటించినా.. ఇండ్లు ఇస్తున్నట్లు, ఎక్కడ ఇస్తారనే సమాచారం చెప్పలేదు. లాటరీలో ఎంపికైన వారి పరిస్థితే ఇలా ఉంటే.. దరఖాస్తుదారుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఆరేళ్ల కిందట అప్లై చేసుకోగా ఇంకా తమకు ఇండ్లు ఇవ్వడం లేదని, అసలు ఇస్తారా..! లేదా అనేది తెలియడం లేదని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. ఏండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు ఏం చెప్పడం లేదని వాపోతున్నారు. నాలుగు రోజుల కిందట కలెక్టరేట్‌లో లాటరీ తీస్తున్నారని తెలుసుకుని దరఖాస్తుదారులు తమకు ఇండ్లు వచ్చాయా? అని బారులు తీరారు. ఎవరికి ఇండ్లు వచ్చాయనేది లాటరీలో ఎంపికైన వారికి కూడా సమాచారం ఇవ్వకపోవడంతో అందరూ కలెక్టరేట్‌కు చుట్టూ తిరుగుతున్నారు. లాటరీ తీసినది కూడా కొందరు రెవెన్యూ అధికారులకే తెలియలేదు.
గ్రేటర్‌లో 7.10 లక్షల అప్లికేషన్లు
గ్రేటర్ సిటీ వ్యాప్తంగా 2017 నుంచి 2019 వరకు డబుల్ ఇండ్లకు7.10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారుల వద్దకు బల్దియా సిబ్బంది వెళ్లగా అందుబాటులో లేరు.
జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు చేసిన వెరిఫికేషన్ లో సగం దరఖాస్తులు అనర్హులని తేలినట్టు ప్రకటించారు. కిరాయిలకు ఉన్నప్పుడు స్థానిక అడ్రసులతో అప్లై చేసుకోగా.. ప్రస్తుతం ఆ అడ్రస్‌లో లేరు. ఫోన్ నెంబర్లు కూడా కలవడం లేదు. దీంతో అలాంటి దరఖాస్తులను అధికారులు పక్కన పెట్టారు. దరఖాస్తు చేసుకొని వెరిఫికేషన్ కానీ వారికి అవకాశం ఇవ్వలేదు. అందుబాటులో లేనివారితో పాటు ఉన్న అర్హులు కాని వారిని అనర్హులుగా గుర్తించారు. మొత్తం 3.50 లక్షల మందిని అర్హులుగా తేల్చారు.
ఆలస్యమెందుకు..
గ్రేటర్‌లో 111 ప్రాంతాల్లో బల్దియా లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తోంది. ఇందులో 49 మురికి వాడల్లో 9,828, 62 ఖాళీ స్థలాల్లో 90,172 ఇండ్ల నిర్మాణాలను చేపట్టింది. ఇప్పటికే 70 వేల ఇండ్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 24 ప్రాంతాల్లో 4 వేలకుపైగా ఇండ్లను లబ్ధిదారులకు అందజే
శారు. అయితే ప్రస్తుతం నిర్మిస్తున్న అన్ని ఏరియాల్లో అధికంగా కొల్లూరులో 15,600 ఇండ్లను నిర్మిం
చారు. నిరుపేదలకు అక్కడే అందజేస్తామని ప్రతి మీటింగ్‌లోనూ మంత్రులు హామీ ఇచ్చారు. 2 నెలల కిందట కొల్లూరులో సీఎం కేసీఆర్ ఆరుగురు లబ్ధిదారులకు డబుల్ఇండ్లను అందజేశారు. ఇప్పుడు విడతల వారీగా లాటరీ ద్వారా పంపిణీ చేస్తామని చెబుతున్నా లబ్ధిదారులు మాత్రం ఇండ్లలోకి వెళ్లడంలేదు. ఆ ఇండ్లను గ్రేటర్ లోకి వచ్చే జిల్లాల పరిధిలోని అర్హులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
రెండో విడత ఎప్పుడు..
హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ నెల 23న కలెక్టేరేట్‌లో ఆన్‌లైన్ లాటరీ ద్వారా 7,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. కానీ వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారు ఇండ్లలోకి ఎప్పుడు వెళ్లాలి, ఎక్కడ కేటాయించారో, ఇంటి తాళం ఎవరిస్తారన్నది కూడా తెలియడం లేదు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 1,64,647 దరఖాస్తులు వస్తే.. ఇందులో 58,181 మంది అర్హులుగా గుర్తించారు. మొదటి విడత కింద 7,500 ఎంపిక చేయగా మిగతా వారికి ఎప్పుడు కేటాయిస్తారనేది ప్రకటించలేదు. హైదరాబాద్ జిల్లాలోనే ఇలా ఉంటే గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన దరఖాస్తులకు లాటరీ కూడా తీయలేదు. ఎప్పుడు తీస్తారనేదానిపై స్పష్టత లేదు. గ్రేటర్‌లో 70వేల ఇండ్లు సిద్ధంగా ఉండగా.. విడతల వారీగా ఎందుకు ఇస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో.. ప్రతిపక్ష నేతల్లో వ్యక్తమవుతున్నాయి.