కౌన్సిల్ ఏర్పడి ఏడాదైనా.. హామీలు అమలైతలే!

కౌన్సిల్ ఏర్పడి ఏడాదైనా.. హామీలు అమలైతలే!

ఫ్రీ వాటర్​ స్కీమ్​ నుంచి ఈ- లైబ్రరీల వరకు అంతే..
హైదరాబాద్, వెలుగు: బల్దియా పాలకమండలి ఏర్పడి ఏడాదైంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను సరిగా అమలు చేయట్లేదు. ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్, మూసీ బ్యూటిఫికేషన్, డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు, నాలాల విస్తరణ, ఈ – లైబ్రరీలు తదితర హామీలన్నీ పెండింగ్ లోనే పెట్టింది. రెండేండ్లుగా భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని కాలనీలు నెలల తరబడి వరద నీటిలో ఉండగా జనాలు ఇబ్బంది  పడ్డారు. మంత్రి కేటీఆర్​పర్యటనలో భాగంగా త్వరలోనే సమస్యకు చెక్ పెడతామని వరద ముంపు బాధితులకు హామీ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు ముందు వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఇప్పటిదాకా ఎలాంటి పనులు చేయలేదు. ఎన్నికల తర్వాత కూడా గతేడాది భారీ వర్షాలకు నీటి మునిగిన కాలనీలను పట్టించుకోవడంలేదు.  ఎస్ఎన్​డీపీ (నాలా స్ట్రాటజిక్​ డెవలప్​ మెంట్ ప్రోగ్రామ్​ ) ద్వారా నాలాల పనులు చేస్తామని, ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో బల్దియాకు కేవలం రూ.633 కోట్లకు మాత్రమే పర్మిషన్​ ఇచ్చింది.  ప్రభుత్వ అంచనాలోని 5 శాతం మాత్రమే నిధులు ఇచ్చింది. మిగతా 95 శాతం కూడా అందజేస్తే సిటీలో వరదల సమస్య  తీరుతుంది. ఈ ఏడాది వానాకాలం నాటికి కూడా నాలాల పనులు పూర్తయ్యేలా కనిపిస్తలేవు. 

ఏ ఒక్కటి పట్టించుకోవట్లే.. 
మూసీ బ్యూటిఫికేషన్​తో పాటు బాపూఘాట్​ నుంచి నాగోల్ వరకు బోటింగ్ ఫెసిలిటీ కల్పిస్తామని, ఇందుకు రూ.5 వేలు కోట్లు ఖర్చు చేస్తామని  చెప్పి పనులు ఇంకా మొదలే పెట్టలేదు.  శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు సెకండ్​ఫేజ్​లో మెట్రో రైల్ విస్తరణ ప్రపోజల్స్​ రెడీనే చేయలేదు. ఎంఎంటీఎస్ రైళ్లను మరో 90 కిలోమీటర్లు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చినా  ఇది స్లోగా కొనసాగుతోంది. హెచ్ఎండీఏ పరిధిలోని 2,700 చెరువులను  బ్యూటిఫికేషన్ చేస్తమని, పదుల సంఖ్యలోనూ పూర్తి చేయలేదు. ఆర్టీసీ బస్సులను ఆధునీకరిస్తామని, ఎలక్ర్టిక్ బస్సుల వాడకం పెంచుతామని చెప్పి,  ఇప్పటికే సిటీ బస్సుల్లో 800 తగ్గించారు.132, 11 కేవీ హైటెన్షన్ విద్యుత్​ సప్లైని అండర్ గ్రౌండ్ ద్వారా ఏర్పాటు చేస్తామని పూర్తిస్థాయిలో చేయలేదు. సిటీలో ఇప్పటికే 5 లక్షల సీసీ కెమెరాలు ఉండగా, మరో 5 లక్షలు ఏర్పాటు చేసి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్​ రాకుండా చేస్తామన్నా కాలేదు.  సిటీకి వచ్చే వారి కోసం షెల్టర్ హోమ్స్ పెంచుతామని కనీసం ఉన్నవాటిని కూడా పట్టించుకోవడం లేదు. 
 

నలువైపులా హాస్పిటల్స్ కడతమని..
జిల్లాల నుంచి సిటీలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారికి శివారు ప్రాంతాల్లోనే ట్రీట్ మెంట్​అందేలా నలువైపులా నాలుగు టిమ్స్​ ఆస్పత్రులను నిర్మిస్తామని మేనిఫెస్టోలో  హామీ ఇచ్చినప్పటికి గచ్చిబౌలి టిమ్స్​ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.  మరో మూడింటిని నిర్మిస్తున్నామని చెబుతుండగా పనులైతే మొదలు పెట్టలేదు.  గ్రేటర్ లో 350 బస్తీ దవాఖానలను అందుబాటులో తీసుకొస్తామని 250 వద్దనే ఆగిపోయింది. సిటీలో ప్రభుత్వ హాస్పిటల్స్​ లేని ప్రాంతాలు చాలా  ఉండగా కరోనా కష్టాలు వచ్చినా  హాస్పటల్స్​ నిర్మాణాల్లో వేగం పెంచలేదు. 
 

ఫ్రీ బస్ పాస్​ ఇస్తమని..
బస్తీల్లో ఇంగ్లీష్ మీడియంతో మోడల్ స్కూల్స్​ ఏర్పాటు చేస్తామని చెప్పినా పట్టించుకోవడంలేదు. విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ – లైబ్రరీలు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించి కల్పించలేదు. సీనియర్ సిటిజన్లకు ప్రతి డివిజన్ లో లైబ్రరీ, సీనియర్ సిటీ జన్స్ క్లబ్, యోగా సెంటర్, జిమ్​ల ఏర్పాటుతో పాటు  ఫ్రీ బస్ పాసు సౌకర్యం కల్పిస్తామనే హామీలు అమలు కావడంలేదు.  

పేరుకే ఫ్రీ వాటర్ ​స్కీమ్​ 
ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా చేస్తామని మేనిఫెస్టోలో రెండో అంశంగా  ఇదే చూపారు. ఇప్పటికీ  పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదు. కొంతమందికి మాత్రమే ఫ్రీ వాటర్ స్కీమ్​ వర్తిస్తుంది. కొంతమందికి కొన్ని నెలలు ఫ్రీ వాటర్​అందించినా ఆ తర్వాత బిల్లులను వసూలు చేశారు. మురికి వాడల్లోని వారికి ఉచితంగా వాటర్ సప్లయ్ చేస్తామనప్పటికి చాలా ప్రాంతాల్లో అమలు కాలేదు. బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తుండగా జనాలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. 

ఫస్ట్​ ఫ్లోర్ ​మునిగినా పట్టించుకోవట్లే..
ఏటా వానలు పడ్డప్పుడు కాలనీలోంచి బయటకు రాలేకపోతున్నం. రెండేండ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోజుల తరబడి ఇబ్బందులు పడ్డం. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పనులు చేయలేదు. వచ్చే వానాకాలం వరకైనా పనులు చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటం. 
- అర్జున్, మయూరి మార్గ్, బేగంపేట్

లక్ష డబులు బెడ్రూమ్​ ఇండ్లు నిర్మించి ఇస్తమని..
గ్రేటర్ లో లక్ష డబుల్​ బెడ్రూం ఇండ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని ప్రతి మీటింగ్​లో  మంత్రులు చెబు తుండగా ఇప్పటి వరకు 3,808 మందికి మాత్రమే అందించారు. నిర్మాణాలు పూర్తయిన వాటికోసం లబ్ధి దారులను కూడా ఎంపిక చేయట్లేదు. దరఖాస్తులు చేసుకున్న వారు ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడు తున్నారు. అర్హులకు కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తామని చెప్పినప్పటికీ హుజూరాబాద్​ ఎన్నిక లప్పుడు కొంతమందికి మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ప్రక్రియను నిలిపేశారు. దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఎదురు చూస్తున్నారు. భర్తలు చనిపోయిన  వాళ్లు  ఏండ్లు గడుస్తున్నా  పెన్షన్​ రావట్లేదు.

ఏ ఆఫీసుకు పోయినా ఏం చెప్పట్లేదు 
డబుల్​బెడ్రూం ఇంటికి అప్లై చేసుకుని నాలుగేండ్లైంది. నేటికి ఇల్లు మంజూరు చేయట్లేదు. ఎప్పుడిస్తారో చెప్పడంలేదు. ఏ ఆఫీసుకి పోయినా కూడా ఎవరూ ఏం చెప్పడంలేదు. ఎన్నికలకు ముందు అందరికి ఇండ్లిస్తమని చెప్పి, ఇప్పుడు అసలే పట్టించుకుంటలేరు. 
- సుగుణమ్మ, అంబర్ పేట