3 కమిషనరేట్లలో 9,101 పోలింగ్ స్టేషన్లు
బందోబస్తులో 52,500 మంది పోలీసులు
పోలింగ్ స్టేషన్లకు జియో ట్యాగింగ్
సీసీటీవీ, మౌంటెడ్ కెమెరాలతో నిఘా
స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లు రెడీ
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం6 గంటలతో ముగిసింది. పోలీసులు పోలింగ్‌పై ఫోకస్ పెట్టారు. పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్ సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 52,500 మంది పోలీసులతో మూడు కమిషనరేట్లలోని150 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదివారం రివ్యూ మీటింగ్స్ నిర్వహించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌ను జియో ట్యాగింగ్ చేశారు. సీసీటీవీ, మౌంటెడ్ కెమెరాలతో ప్రతి ఏరియాను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల నిఘాలోకి తెచ్చారు.
మూడంచెల భద్రత
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేశారు. వీటిని నాలుగు కేటగిరీలుగా విభజించి, మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతీ పోలింగ్ స్టేషన్‌ను జియో ట్యాగ్ చేసి, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లతో పాటు లోకల్ డీసీపీ, ఏసీపీ, లోకల్ పీఎస్, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్‌తో కనెక్ట్ చేశారు. గ్రౌండ్ లెవల్‌లో డ్యూటీ చేసే ప్రతీ కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి అధికారిని పోలీస్ యాప్స్‌తో కోర్డినేట్ చేసేలా ప్లాన్ చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద హైడెఫినెషన్ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. వీటిని లోకల్ పీఎస్, కంట్రోల్ రూంలతో మానిటరింగ్ చేస్తున్నారు.
మొబైల్ ఫోన్లకు నో పర్మిషన్
ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ను పటిష్టంగా అమలు చేసేలా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్లు, వార్డుల్లో అభ్యర్థుల కదలికలపై ఆంక్షలు విధించారు. క్యాండిడేట్, ఏజెంట్‌కి మాత్రమే వెహికల్‌లో అనుమతిచ్చారు. ఈసీ పర్మిషన్ స్టిక్కర్లు లేని వెహికల్స్ కు అనుమతి లేదు. ఓటర్లు తమ వాహనాలను 200 మీటర్ల దూరంలో పార్క్ చేసి రావాలని సూచించారు. ఒకరి కంటే ఎక్కువ మందిని ట్రాన్స్‌పోర్ట్ చేసే వాహనాలను సీజ్ చేస్తారు. పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్స్ తో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు,అగ్గిపెట్టె, లైటర్‌లను అనుమతించరు. కొవిడ్ రూల్స్‌ను మస్ట్‌గా ఫాలో కావాలని పోలీసులు సూచిస్తున్నారు.
చెకింగ్స్, బైండోవర్లు
ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజైన నాటి నుంచి గ్రేటర్‌లో ఉన్న లైసెన్స్డ్ వెపన్స్ ను డిపాజిట్ చేయించారు. అనుమానితులు, రౌడీషీటర్లు, కమ్యూనల్ అఫెండర్స్‌ను బైండోవర్ చేశారు. స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, మొబైల్ పార్టీస్‌తో చెకింగ్ చేశారు. అక్కడక్కడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. క్యాష్ ట్రాన్స్‌పోర్టేషన్‌పై మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్ పెంచారు. డయల్100 కాల్స్ డైరెక్ట్‌గా కమాండ్ కంట్రోల్ నుంచి లోకల్ పోలీసులకు చేరేలా కనెక్ట్ చేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీంలను అలర్ట్ చేశారు.
పోలింగ్ స్టేషన్లన్నింటిపై నిఘా
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 84 వార్డులు పూర్తిగా, మరో 5 వార్డులు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో కలిసి ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రచారం ప్రశాంతంగా ముగిసింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇప్పుడు పోలింగ్‌పై దృష్టి పెట్టాం. పోలింగ్ స్టేషన్లు అన్నీ పోలీస్ నిఘాలో ఉన్నాయి. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.‑అంజనీకుమార్, సీపీ, హైదరాబాద్.