హైదరాబాద్, వెలుగు: పచ్చగా ఉన్న హైదరాబాద్ లో బీజేపీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఓట్ల కోసం కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ నేతృత్వంలో వివిధ బీసీ కుల సంఘాల నేతలతో జరిగిన మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. ‘‘పూల బోకే లాంటి హైదరాబాద్ ను విచ్చిన్నం చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చెందిన పెద్ద మనిషి పిచ్చిగా మాట్లాడుతున్నడు. పచ్చగా ఉన్న సిటీలో చిచ్చుపెట్టాలని చూస్తుండు. నాలుగు ఓట్ల కోసం ఇట్లా మాట్లాడుతుండు. హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారట. హోష్ లో ఉండే మాట్లాడుతున్నరా? ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను చెడగొట్టి, దిగజారి మాట్లాడుతున్నరు”అని ఆరోపించారు. ఎవరేం మాట్లాడుతున్నారో ప్రజలు బేరీజు వేసుకుని ఓటేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని అన్నారు. భవిష్యత్ లో బీసీ కులాలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా.. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీసీల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో మూడు రోజుల పాటు బీసీ సమస్యలపై చర్చించి సీఎంకు నివేదిక ఇచ్చామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో బీసీ సంఘాలు టీఆర్ఎస్ కు మద్దతు పలకడం సంతోషకరమన్నారు.
ఎన్నికలకు సంబంధం లేని అంశాలతో ప్రశ్నలు
బీజేపీపై చార్జిషీట్ అంటూ కేటీఆర్ 50 ప్రశ్నలు వేశారు. అందులో చాలా వరకు జాతీయ అంశాలే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నుంచి ఈ మధ్య కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల వరకు అందులో పేర్కొన్నారు. కేవలం 8 ప్రశ్నలు మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినవి ఉన్నాయి. హైదరాబాద్ డెవలప్కు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, వరద సాయం చేయలేదని, ఐటీఐఆర్ ను రద్దు చేసిందని, మూసీ ఏరియా డెవలప్మెంట్, స్కైవేలకు ఫండ్స్ ఇవ్వలేదని చార్జిషీట్లో కేటీఆర్ ఆరోపించారు.
మీపైనే చార్జిషీట్ వేస్తం
టీఆర్ఎస్ ఆరేండ్ల పాలనపై బీజేపీ విడుదల చేసిన చార్జిషీట్ పై కేటీఆర్ స్పందించారు. దీనిపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అందుకు తమపై చార్జిషీట్ వేస్తారా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వంపై చార్జిషీట్ వేస్తామన్నారు. ‘‘కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు జ్ఞానం లేదు. మజ్లిస్ పార్టీ మా ప్రభుత్వంలో భాగస్వామి కాదు. అలాటప్పుడు ఎంఐఎం, టీఆర్ఎస్ పాలనపై కలిపి చార్జిషీట్ ఎట్లా వేస్తరు. మీరు కాశ్మీర్ లో పీడీపీతో కలిసి పదవులు పంచుకున్నరు. మేం ఎవరితో అధికారం పంచుకోలేదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు చెందని ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు బీజేపీపై ఎందుకు చార్జిషీట్ వేయకూడదని ప్రశ్నించారు. బీజేపీకి ఓట్లు వేస్తే జీహెచ్ఎంసీని, చార్మినార్ను కూడా అమ్మేస్తారని ఆరోపించారు.