అన్నీ పిరమే! క్యాండిడేట్లకు భారంగా మారిన ఎన్నికలు

ఈసీ చెప్పిన దానికంటే మించిపోతున్న ప్రచార ఖర్చు
కండువా నుంచి కిరాయిల వరకు పెరిగిన చార్జీలు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు అంటేనే మందీ మార్బలం. అంతకు మించి ధనబలం ఉంటేనే బరిలో నిలిచేలా చేస్తాయి. ఇక పైసలు ఉంటే తప్ప… ఎన్నికల్లో సత్తా చాటలేమనే స్థాయికి ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి. పార్టీలు కూడా పైసలు ఖర్చు పెట్టేటోళ్లకే టికెట్లు ఇచ్చి, పార్టీ ముఖ్యులతో ప్రచారాలు చేయిస్తాయి. అయితే ఈసారి కరోనా వల్ల గ్రేటర్​లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పెరిగిన ధరలు ఇబ్బందిగా మారాయి. ఒక్కో అభ్యర్థి ఐదు లక్షలకు మించి ఖర్చు చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉంటే, డిపాజిట్లు రావాలన్నా… కనీసం పది లక్షలు ఖర్చు చేస్తేగాని సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు, పార్టీ నేతలు చెబుతున్నారు.

కండువాల నుంచి మొదలు..

ప్రచారానికి కండువాలు కావాలి. ఒక్కో వార్డులో తిరిగేందుకు 30 మంది జనాలు ఉండాలి. వీరికి తోడు పాంప్లెంట్లు మెయింటైన్ చేయాలి. ఇక గల్లీలన్నీ మోత మోగించాలంటే డప్పులు, మైకులు కామన్ గా ఉండేవే. వీటితోపాటు కాలనీల్లో, బస్తీల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లతోపాటు టెక్నాలజీ సాయంతో నడిచే సోషల్ మీడియా ప్రచారం ఉండాలి. వీటితో పాటు టెలీకాలర్ల సందడి షరా మామూలే. వచ్చినోళ్లకు, పోయినోళ్లకు రెండు పూటల భోజనంతోపాటు చేతి ఖర్చులు కూడా ఇవ్వాలి. అయితే కరోనా వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి. వస్తువులతో పాటు మనుషులకు కూడా ఎక్కువే ఇచ్చి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఖర్చుల నడుమ ఒక్కో క్యాండిడేట్​ ఎన్నికల సంఘం చెప్పిన దానికంటే అనధికారికంగా లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.

కరోనా కారణంగా సిటీలో కమర్షియల్ యాక్టివిటీ భారీగా పడిపోయింది. సిటీలో ప్రధానమైన ఆదాయ వనరుగా చెప్పే రెంటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం దివాలా తీసింది. ఈ క్రమంలో జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. కండువా నుంచి కార్యకర్త వరకు అన్ని పిరమే కావడంతో పోటీకి ముందే ఎలక్షన్ ఫండ్ సిద్ధం చేసుకున్నారు. గతంలో ఒక్కో డప్పుకు ఈసీ లెక్కల ప్రకారం రూ. 400 మించి ఖర్చు చేయొద్దని చెబుతుండగా, మార్కెట్ లో రూ. 600కు పైనే ఉంది. ఇక కండువాలు, పోస్టర్లు, కరపత్రాల ప్రింటింగ్ ఛార్జీలు కూడా పెరిగాయని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు చెబుతున్నారు. అడ్డా కూలీలను ప్రచారానికి తీసుకుపోయే క్రమంలో ఒక్కో కూలీకి రూ. 500 నుంచి 1000తోపాటు భోజనాలు పెడుతున్నారు. కరోనా కారణంగా కూలీల కొరత కూడా ఉందని ప్రస్తుతం ఉన్నవాళ్లు రూ. 1500 వరకు అడుగుతున్నారని ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకా నగర్ డివిజన్ లోని ఓ పార్టీ అభ్యర్థి వివరించారు. ఏదిఏమైనా ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు ఖర్చుతో యవ్వారంలా మారింది.

ఈసీ చెప్పిన దాని కంటే ఎక్కువే

ఖర్చులను నియంత్రించేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో అభ్యర్థి చేయాల్సిన ఖర్చులపై పక్కాగా అమలు చేసే పరిస్థితి లేదు. ఈసీ పేర్కొన్న 31 అంశాలకు ఉన్న ధరలతో పోల్చితే 10–20 శాతం ఎక్కువే ఉన్నాయి. ఈసీలో ఒక ఏసీ ఫంక్షన్ హాల్ రూ. 1.10లక్షలు అని సూచించగా, కరోనా కారణంగా మొన్నటి వరకు వెలవెలబోయిన ఫంక్షన్ హాల్స్​ ఇదే అదనుగా భావించి రూ. 1.50లక్షల నుంచి రూ. 2లక్షల వరకు చార్జీ చేస్తున్నాయి. ఇక భోజనాల ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఒక్కో ప్లేటుకు రూ.70 నుంచి రూ.100 వరకు పెరిగింది.

For More News..

ప్రచారానికి పోతే రూ.1000, బిర్యానీ ప్యాకెట్

కరోనా మరణాల కట్టడికి కొత్త ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు కనుగొన్న తెలంగాణ సైంటిస్ట్

బ్యాక్ టు ఇండియా.. వందేళ్ల కింద ఎత్తుకుపోయిన విగ్రహం