సీపీఐ ఫిర్యాదుతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషనర్ పార్థసారథి
హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ ను రద్దు చేసింది ఎన్నికల కమిషన్. వార్డు-26 లో సీపీఐ గుర్తు కంకి-కొడవలికు బదులు సీపీఎం పార్టీ వారి కొడవలి-సుత్తి గుర్తును ముద్రించారు అధికారులు. బ్యాలెట్ పేపర్లో తమ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం గుర్తు ఉన్నట్లు కొంత ఆలస్యంగా గుర్తించారు. అప్పటికే పలువురు ఓట్లు వేసి వెళ్లడంతో ఎన్నికల సిబ్బందికి ఏం చేయాలో పాలుపోలేదు. పోలింగ్ నిలిపివేయాలంటూ సీపీఐ కార్యకర్తలు ఎన్నికల సిబ్బందిని ప్రశ్నించగా తమకు ఆదేశాలు వస్తేనే చేస్తామని స్పష్టం చేశారు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నేరుగా ఎనికల కమిషన్ పార్థసారథికి ఫిర్యాదు చేశారు. ఒక పార్టీ గుర్తులను ఎలా మారుస్తారని ప్రశ్నించగా.. జరిగిన పొరపాటును తెలుసుకున్న ఎన్నికల కమిషన్ పార్థసారథి పోలింగ్ నిలిపివేయాలని ఆదేశించారు.
ఎల్లుండి రీపోలింగ్
గుర్తుల తారుమారుపై స్పందించిన ఎన్నికల కమిషన్ వెంటనే ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఎల్లుండి రీపోలింగ్ జరుపుతామని స్పష్టం చేసింది. గుర్తులను సరిచేసి.. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుపుతామని ఈసీ తెలిపింది.