30 ప్రాంతాల్లోని 158 హాళ్లలో లెక్కింపు
డ్యూటీలో 31 మంది అబ్జర్వర్లు.. 8,152 మంది సిబ్బంది
8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్
మధ్యాహ్నం కల్లా గ్రేటర్ రిజల్ట్స్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల కౌంటింగ్‌కు అంతా సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్టవనుంది. 30 ప్రాంతాల్లోని 158 హాళ్లలో 150 డివిజన్‌ల ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం 8,152 మంది సిబ్బందిని, 31 మంది అబ్జర్వర్లను ఎస్‌ఈసీ నియమించింది. ప్రతి టేబుల్ దగ్గర ఓ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఒక్కో డివిజన్‌లో 14 టేబుళ్ల ద్వారా లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం నుంచి రిజల్ట్స్ వెలువడొచ్చని ఎస్‌ఈసీ అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 74,67,256 మంది ఓటర్లుండగా 34,50,331 మంది ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1,926 మంది ఓటేశారు. కరోనా రూల్స్ ప్రకారం ఓట్ల కౌంటింగ్‌కు చర్యలు తీసుకున్నారు. లెక్కింపు ప్రాసెస్ అంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేయనున్నారు.
మూడు రౌండ్లలో రిజల్ట్ తేలిపోద్ది
ఒక్కో రౌండ్‌కు ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ఈ లెక్కన ఒక రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కిస్తామని, మూడు రౌండ్లలో డివిజన్ రిజల్ట్ తేలిపోతదని అధికారులు తెలిపారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు ఏజెంట్లు మాస్కు పెట్టుకోవాలని, ప్రతి టేబుల్ దగ్గర శానిటైజర్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని, తర్వాత బ్యాలెట్ పేపర్లను కౌంట్ చేస్తామని తెలిపారు. నేరేడ్‌మెట్, వినాయకనగర్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్‌బాగ్, మల్కాజ్‌గిరి, గౌతంనగర్, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్ డివిజన్‌లలో రెండు హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు తెలిపారు. రెండో హాల్‌లో ఓట్ల లెక్కింపును కో ఆర్డినేట్ చేయడానికి ఆ డివిజన్‌లకు ప్రత్యేకంగా ఏఆర్వోలను నియమించామన్నారు.
పొద్దున 7.45కు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్
ఒక్కో డివిజన్ ఓట్లను 14 టేబుళ్ల ద్వారా లెక్కిస్తామని, పోటీ చేసిన క్యాండిడేట్లు ఒక్కో టేబుల్‌కు ఒక్కో కౌంటింగ్ ఏజెంట్‌ను నియమించుకోవచ్చని అధికారులు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు స్టార్టవడానికి గంట ముందే హాల్‌కు చేరుకోవాలన్నారు. ఏజెంట్లకు ఇచ్చే ఐడీ కార్డులపై కౌంటింగ్ హాల్, టేబుల్ నంబర్ తదితన వివరాలు ఉంటాయని తెలిపారు. పోటీ చేసిన క్యాండిడేట్లు, వారి ఎలక్షన్ ఏజెంట్ల సమక్షంలో ఉదయం 7.45 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని, రిటర్నింగ్ ఆఫీసర్ జారీ చేసిన ఐడెంటిటీ కార్డులున్నవారినే కౌంటింగ్ హాల్‌లోకి అనుమతిస్తామని చెప్పారు.
సెల్‌ఫోన్లకు పర్మిషన్ లేదు
కౌంటింగ్ హాళ్లలోకి సెల్‌ఫోన్‌లు, ఇంక్ పెన్నులు, వాటర్ బాటిల్స్‌కు అనుమతి లేదని అధికారులు తెలిపారు. హాల్‌లో ఉన్న వ్యక్తులు ఓటింగ్ రహస్యాన్ని కాపాడాల్సి ఉంటుందని, లోపలి ఇన్ఫర్మేషన్‌ను బహిర్గతం చేస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.
రెండు దశల్లో ఓట్ల లెక్కింపు
ఓట్ల లెక్కింపు రెండు దశల్లో జరగనుంది. తొలుత బ్యాలెట్ పేపర్లను మడత విప్పకుండానే 25 ఓట్లకో కట్ట చొప్పున రబ్బర్ బ్యాండ్లు వేస్తారు. ఆ పోలింగ్ స్టేషన్‌లో పోలైన మొత్తం ఓట్లతో లెక్క సరి చూసుకొని, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరున్న డ్రమ్ములో వేస్తారు. రెండో విడతలో డ్రమ్ములోని బ్యాలెట్ కట్టలను కలిపి కౌంటింగ్ హాల్‌లోని ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల (40 బండిళ్లు) చొప్పున ఇస్తారు. కౌంటింగ్ సిబ్బంది ప్రతి ఓటును సూపర్‌వైజర్‌ల సమక్షంలో ఏజెంట్లకు చూపిస్తూ అది చెల్లుబాటు అవుతుందో లేదో చెక్ చేస్తారు. ఆ టేబుల్‌పై క్యాండిడేట్ల గుర్తుల వారీగా కేటాయించిన కంపార్ట్‌మెంట్లలో వేస్తారు. ఓటు చెల్లుబాటు అవుతుందా లేదా అని రిటర్నింగ్ ఆఫీసరే తుది నిర్ణయం తీసుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల్లోపు ప్రాథమిక లెక్కింపు పూర్తవుతుందని, మధ్యాహ్నం 3 గంటల వరకు ఎక్కువ ఓటర్లున్న వార్డులు మినహా మిగతా వార్డుల్లో లెక్కింపు పూర్తవుతుందని చెప్పారు. లెక్కింపు పూర్తి కాగానే రిటర్నింగ్ అధికారి 30ఏ లోని రిజల్ట్ షీట్‌లో క్యాండిడేట్ల వారీగా పోలైన ఓట్లను నమోదు చేస్తారు. తుది ఫలితాలను ఎస్‌ఈసీ అబ్జర్వర్ అనుమతితో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తారు. గెలిచిన క్యాండిడేట్‌కు ఆర్వో డిక్లరేషన్ అందజేస్తారు. ఓట్లు సమానంగా వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ డ్రా తీసి విన్నర్‌ను ప్రకటిస్తారు. ఎవరైనా క్యాండిడేట్ రీ కౌంటింగ్ చేయాలని కోరితే నిర్దేశిత నమూనాలో రిటర్నింగ్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేయాలి. ఆయన ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకొని రీ కౌంటింగ్‌పై నిర్ణయం తీసుకుంటారు.
8.10 గంటలకు బ్యాలెట్ ఓట్ల లెక్కింపు: పార్థసారథి
రిటర్నింగ్ అధికారులు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని, 8.10 గంటలకు బ్యాలెట్ బాక్సుల్లో నమోదైన ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయాలని కౌంటింగ్ అబ్జర్వర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. గురువారం సీడీఎంఏ కాన్ఫరెన్స్ హాల్ నుం చి కౌంటింగ్ అబ్జర్వర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలైన బ్యాలెట్లలో డౌట్ ఉన్న వాటిపై రిటర్నింగ్ అధికారి పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. అబ్జర్వర్ల అనుమతి తీసుకున్నాకే
ఫలితాలను రిటర్నింగ్ ఆఫీసర్లు రిలీజ్ చేయాలని చెప్పారు.
టెండర్ ఓటు పడితే..?
ఎవరైనా ఓటరు తనకన్నా ముందే తన పేరుతో ఇంకొకరు ఓటేసినట్టు గుర్తిస్తే అతడికి టెండర్ ఓటేసే అవకాశమిస్తారు. ఇలా నమోదైన టెండర్ ఓటును ఎన్నికల కౌంటింగ్ టైమ్‌లో పరిగణనలోకి తీసుకోవద్దని ఎస్‌ఈసీ ఆదేశించింది. బ్యాలెట్ బాక్సులో నమోదైన ఓట్లనే లెక్కించాలంది. సీల్డ్ కవర్‌లోని టెండర్ ఓటును యేడాది పాటు భద్రపరచాలంది.