17 ఏండ్ల అబ్బాయికి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీ

17 ఏండ్ల అబ్బాయికి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీ

ఐఎస్​ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ బూత్​లో గుర్తించిన స్థానికులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్​ఎంసీ ఎన్నికల డ్యూటీలు వేయడంలో ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వయస్సు, హోదాతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వారికి డ్యూటీలు వేశారు. ఓటు హక్కు కూడా లేని ఓ బాలుడికి ఏకంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించారు. ఐఎస్ సదన్ డివిజన్(38) పరిధిలోని సింగరేణి కాలనీకి సంబంధించిన 24వ నంబర్ పోలింగ్ బూత్ లో వెలుగు చూసిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

స్థానిక నాయకులు ఆ బాలుడిని గుర్తించి ప్రశ్నించగా.. తన వయస్సు 17 ఏండ్లని చెప్పాడు. ఐడెంటిటీ కార్డుపై ఎ.వరుణ్​ సాగర్, హోదా స్టూడెంట్ అని రాసి ఉంది. దీంతో సదరు నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రూల్స్ ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా సర్కారు ఉద్యోగులను, లేదంటే ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించాల్సి ఉన్నప్పటికీ.. ఓటు హక్కు కూడా లేని పిల్లలకు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.