కాలనీలు, అపార్ట్ మెంట్ల నుంచి అంతంత మాత్రమే
గడపదాటని ఐటీ కారిడార్ వాసులు
కోర్ సిటీలో తక్కువ పోలింగ్…శివార్లలో మంచి పర్సంటేజ్
వరుస సెలవుల ఎఫెక్ట్
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పోలింగ్లో మళ్లీ బస్తీ ఓటర్లే బెటర్ అని నిరూపించుకున్నరు. ఎప్పటిలాగే వాళ్లే బాధ్యతగా ఓటేసిన్రు. చదువుకొని, అన్ని తెలిసిన ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయీస్, బిజినెస్ మెన్లు ఓటేసేందుకు బద్దకం చూపారు. పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు సినిమా హీరోలు, సెలబ్రిటీలతో ప్రచారం చేయించిన గింతకూడా ఫాయిదా లేకుండా పోయింది. సమస్యల గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించేటోళ్లు ఓట్లు వేసేందుకు మాత్రం రాలేదు. కోర్ సిటీలో ఉన్నోళ్ల కన్నా…శివార్లలో ఉన్నోళ్లే నయం. రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లే ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కన్నా దాదాపు 10 నుంచి 15 శాతం ఓటింగ్ పెంచాలని భావించినప్పటికీ ఒక్క శాతం పోలింగ్ పెరిగింది. మొత్తం 74 లక్షల ఓటర్లు ఉంటే 34. 50 లక్షల మంది మాత్రమే ఓటేసిన్రు.
కదిలిన బస్తీ జనం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని వర్గాల జనాలు ఉంటారు. పేదల నుంచి సెలబ్రిటీల వరకు అన్ని స్థాయిలో సిటీలో అన్ని డివిజన్లలో ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో బస్తీ జనాలు మిగిలిన వర్గాల కంటే ఓటేసిన వారిలో ముందు ఉన్నారు. సిటీ వ్యాప్తంగా 2 వేలకు పైగా బస్తీలు ఉండగా, ఇందులో 18 లక్షల మంది జనాభా ఉంటారనే అంచనా. ఇందులో ఉన్న జనాభాలో 75 శాతం కంటే ఎక్కువ బస్తీవాసులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బస్తీలు ఎక్కువగా ఉండే డివిజన్లలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇందులో ప్రధానమైన చర్లపలి, చిలుకా నగర్, రామాంతాపూర్, ఉప్పల్, హయత్ నగర్, అంబర్ పేట్, అడ్డగుట్ట, బండ్ల గూడ వంటి ప్రాంతాల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇందులోనూ 75 శాతం ఓట్లేసింది బస్తీలళ్ల ఉండేటోళ్లే.
కోర్ సిటీలో ఓట్లు పడలే…
గ్రేటర్లోని కోర్ సిటీ జనాలు ఎప్పట్లాగే ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కాలనీలు, అపార్టుమెంట్ల వాసులు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు బద్దకం చూపారు. పోలింగ్ డే సెలవును ఎంజాయ్ చేస్తూ ఇంటికే పరిమితమయ్యారు. చాలా తక్కువ మందే ఓటు వేసేందుకు వచ్చారు. క్యాంపెయిన్ టైమ్ లోనే చాలా అపార్ట్ మెంట్లలో ప్రచారానికి రానీయలేదు. అలాంటి వాళ్లంతా ఓట్లు కూడా వెయ్యలే. సోమాజిగూడలోని కత్రియా హోటల్ పరిసరాల్లో కాలనీ చిన్నదే అయినా… ఇక్కడ అపార్టుమెంట్లే ఎక్కువ. ఈ ఏరియాలో 43.67శాతమే పోలింగ్ అయ్యింది. సెలబ్రిటీలు, రిచ్ పీపుల్ ఎక్కువగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో 99 వేల మంది ఓటర్ల ఉంటే ఓట్లేసింది 46 వేల మంది మాత్రమే. షేక్ పేట్, కేపీహెచ్ బీ, బేగంపేట్ వంటి ప్రాంతాల్లోనూ 49 శాతం లోపే పోలింగ్ అవటం చూస్తే కాలనీలు, అపార్ట్ మెంట్లలో ఉండే వాళ్లు ఓట్లేయ్యలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన పోలింగ్ కారణంగానే గ్రేటర్ లో మొత్తంగా 46 శాతం పోలింగ్ పర్సంటేజ్ దాటింది, రామచంద్రపురంలో దాదాపు 68, పటాన్ చెరు లో 66, భారతీ నగర్ నగర్ లో 62 శాతం దాకా ఓట్లు పోలయ్యాయి. రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లే ఎక్కువ ఓటింగ్ లో పాల్గొన్నరు.
ఐటీ కారిడార్లలో మళ్లీ అదే పరిస్థితి..
సోషల్ మీడియాల్లో సమస్యలను ప్రస్తావిస్తూ హీరోల్లా ఫీలయ్యే ఐటీ ఎంప్లాయీస్ ఓటింగ్ విషయానికి వస్తే జీరోలమే అనిపించుకున్నరు. ఐటీ ఎంప్లాయీస్ ఓటు వేయరని ఉన్న ప్రచారాన్ని ఈ ఎన్నికల్లోనూ నిలబెట్టుకున్నరు. ఎంతగా అవేర్నెస్ తెచ్చిప్పటికీ మళ్లీ ఐటీ కారిడార్లలో ఓటింగ్ తక్కువే అయ్యింది. మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోఎక్కడ 45 శాతం మించలే. రెండేళ్ల కింద జరిగిన అసెంబ్లీ, లాస్ట్ ఇయర్ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. చందానగర్, మాదాపూర్ లోనైతే 38%, హఫీజ్ పేట్ లో 39%, శేరిలింగంపల్లిలో 41% పోలింగ్ అయ్యింది.
ఓల్ట్ సిటీ లో తక్కువనే..
ఓల్డ్ సిటీలోనూ పోలింగ్ తక్కువనే అయ్యింది. ఈ సారికి పాత బస్తీలోని దాదాపు 45 డివిజన్ల పరిధిలో పోలింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్ని పార్టీలు అంచనా వేశాయి. చార్మినార్, సంతోష్ నగర్, రాజేంద్రనగర్ సర్కిళ్లలోని డివిజన్లలో హోరాహోరీగా ప్రచారం సాగించాయి. కచ్చితంగా పోలింగ్ పెరుగుతుందని లెక్కలు వేసుకున్నయ్. కానీ ఇవన్నీ ఓటర్లు పట్టించుకోలేదు. ఎప్పటిలాగే ఓటేసేందుకు ఇండ్ల నుంచి కదల్లే. ఓల్డ్ సిటీలోని అన్ని డివిజన్ లలో మస్తు తక్కువ ఓట్లు పోలైనయ్. మలక్ పేట్ సర్కిల్ లో 38 శాతం మందే ఓట్లేసిన్రు. ఐతే ఓల్డ్ సిటీలో పోలింగ్ పై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. కంచన్ బాగ్ లో అత్యధికంగా 90 శాతం మంది మహిళలు ఓటేశారని ముందుగా ప్రకటించి ఆ తర్వాత సవరించిన జాబితాలో 45% అని పేర్కొన్నారు. మొత్తంగా ఈ డివిజన్ లో 47.98 % పోలింగ్ నమోదైతే, అంతకు ముందు వెల్లడించిన వివరాల ప్రకారం 70 % ఉండటాన్ని వారు ప్రశ్నించారు. అయిన పోలింగ్ లోనూ రిగ్గింగ్, దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే
స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థలను ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడంతో పాటు, పాలకుల నిర్లక్ష్యంతో గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ పెరగలేదు. నాలుగేళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచటంలో విఫలం కావటంతో ఓటేసినా కార్పొరేటర్ చేసేదేమీ లేదని ఓటరు భావించాడు. అందుకే ఓటేసేందుకు సిటీ జనాలు ఇంట్రెస్ట్ చూపలే. రూ. 67 వేల కోట్లు ఖర్చు చేశామనటం కాదు, మౌలిక వసతుల కోసం ఎంత ఖర్చు పెట్టరన్నది చెప్పాలి.‑పద్మనాభ రెడ్డి, సెక్రటరీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
for more News..