హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని ప్రభుత్వ భవనాలపై ఉన్న రూ.5,564 కోట్ల ఆస్తిపన్ను బకాయిలను వదిలేసిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారు. నెలనెలా టార్గెట్ రీచ్ కాకపోతే శాలరీలు కూడా ఇవ్వబోమని ఫైనాన్స్అడిషనల్ కమిషనర్ ఉద్యోగులను హెచ్చరించినట్లు తెలిసింది. ఎలాగైనా ప్రజల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్కలెక్ట్చేయాలని బిల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. దీంతో సర్కిల్‌స్థాయి ఆఫీసర్లు ప్రాపర్టీ దారులను ఒత్తిడి చేస్తున్నారు. పెండింగ్ఉన్నవారి వద్దకు వెళ్లి పేమెంట్చేయాలని కోరుతున్నారు. కమర్షియల్ భవనాలనైతే ఏకంగా సీజ్ చేస్తున్నారు. ఆఫీసర్లు వెళ్లిన సమయంలో ప్రాపర్టీదారుల వద్ద డబ్బు లేకపోతే చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాతాలో డబ్బులు లేవని ఎవరైనా చెబితే మీ వద్ద డబ్బులు ఎప్పుడు వస్తాయో ఆ తేది వేసి చెక్కులు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. ఏం చేయలేక, పరువు పోతుందని కొందరు చెక్కులు రాసి ఇస్తున్నారు.
ఎర్లీబర్డ్ తర్వాత తగ్గిన కలెక్షన్
గ్రేటర్ సిటీలో మొత్తం 17 లక్షలకు పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో కమర్షియల్ భవనాలు 2 లక్షల 50 వేలు, రెసిడెన్షియల్ భవనాలు 15 లక్షలు ఉన్నాయి. ఏటా ఫైనాన్షియల్ ఇయర్ముగిశాక బల్దియా ఎర్లీబర్డ్ స్కీమ్‌ని పెడుతోంది. ఎప్పట్లాగే గత నెలలో పెట్టింది. ఎర్లీబర్డ్ కింద ట్యాక్స్కట్టినవారికి 5 శాతం రిబెట్ ఇచ్చింది. ఈ స్కీమ్‌ని 8 లక్షల మంది ఉపయోగించుకుని రూ.748 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్చెల్లించారు. ఇక మిగతా 9 లక్షల మంది నుంచి రూ.2 వేల కోట్లు దాకా రావాల్సి ఉంది. ఈ నెలలో రూ.114కోట్లు కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటివరకు కేవలం ప్రాపర్టీ ట్యాక్స్కింద రూ.48 కోట్లు మాత్రమే కలెక్ట్అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు సర్కిల్ అధికారులపై ఫైర్ అవుతున్నారు.
ప్రభుత్వం చెల్లిస్తే అప్పులుండవ్
సిటీలోని ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ట్యాక్సుల రూపంలో జీహెచ్ఎంసీకి రూ.5,564 కోట్లు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లిస్తే బల్దియా ఇప్పటివరకు చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. డైలీ అప్పులకు చెల్లిస్తున్న రూ.కోటి20 లక్షల మిత్తి మిగిలిపోతుంది. కానీ ఆఫీసర్లు ఈ విషయాన్ని వదిలేసి ప్రజలపై ఒత్తిడి తెచ్చి మరీ ప్రాపర్టీ ట్యాక్స్వసూలు చేస్తున్నారు. దీనిపై జనం మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించరా, సామాన్యులపైనే ప్రతాపం చూపిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జులై నుంచి వడ్డీతో కట్టాల్సిందే..
జూన్ నెలాఖరు లోగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవారికి వడ్డీ ఉండదు. జులై ఫస్ట్ నుంచి చెల్లించేవారు ఏప్రిల్, మే, జూన్, జులై నెలకు సంబంధించిన వడ్డీతో కట్టాల్సి ఉంటుంది. ఒక్కో నెలకి వందకు రెండు రూపాయల చొప్పున నాలుగు నెలల వడ్డీ చెల్లించాల్సి ఉంది. వెయ్యి రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే నాలుగు నెలలకు సంబంధించి రూ.80 అదనంగా చెల్లించాలి.