హైదరాబాద్‌లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు నేడే ఆఖరు

హైదరాబాద్‌లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు నేడే ఆఖరు

హైదరాబాద్ సిటీ, వెలుగు: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించడానికి గడువు సోమవారంతో ముగియనున్నది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లోని సిటీజన్ సర్వీస్ కేంద్రాలు సోమవారం రాత్రి 11 గంటల వరకు పని చేస్తాయని బల్దియా అధికారులు తెలిపారు. అలాగే 90 శాతం వడ్డీ మాఫీ అయ్యే వన్ టైం సెటిల్ మెంట్(ఓటీఎస్) గడువు కూడా ఇవాళ్టితో ముగియనున్నది. ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్ కోసం సంబంధిత ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేశారు.  ఉగాది, రంజాన్ వేళల్లో కూడా వారు పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2 వేల కోట్ల టార్గెట్ పెట్టుకోగా, ఆదివారం వరకు రూ.1,894 కోట్లు వచ్చింది. 

ఇందులో ఈ నెల 8 నుంచి అమల్లో ఉన్న ఓటీఎస్​ద్వారా రూ.వంద కోట్లు వచ్చింది. ఈ ఫైనాన్స్​ ఇయర్ కు సంబంధించి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆస్తి పన్ను చెల్లించని వారికి 24 శాతం సింపుల్​ ఇంట్రెస్ట్ పెనాల్టీ పడనుంది. సిటిజన్​ సర్వీస్ సెంటర్లతో పాటు మీ-సేవా కేంద్రాలు, ఆన్​లైన్ ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చని అధికారులు చెప్తున్నారు. గతేడాది రూ.1917 కోట్లు రాగా, ఈసారి ఇంతకు మించే వచ్చే చాన్స్ ఉందని అధికారులు అంటున్నారు.