- ఆవాసాలుగా మూసీ పరివాహక ప్రాంతం, బస్తీలు
- ప్లానింగ్ లేకుండా యాంటీ లార్వా ఆపరేషన్
- ఏటా రూ.10 కోట్లు మోరీలో పోసినట్టే
సిటీని పట్టి పీడిస్తున్న జ్వరాల సమస్యకు దోమల దండయాత్రనే ప్రధాన కారణం. జనాల రక్తం పీల్చుకుని బలంగా తయారవుతున్నాయి.
ఎన్ని మందులు స్ర్పే చేసినా, ఎన్ని రకాల మస్కిటో కాయిల్స్ వాడినా చస్తలేవు. వీటి నివారణలో బల్దియా అధికారులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. నిజానికి జూన్ నుంచే యాంటీ లార్వా ఆపరేషన్ ప్రారంభించాలి. ఫాగింగ్, ఆయిల్ బాల్స్ తో పాటు నీళ్లలో గంబూసియా చేపలను వదలాలి. కానీ దోమల మందు ఎక్కడ పిచికారి చేస్తున్నారో, ఫాగింగ్ ఎక్కడ చేస్తున్నారో అన్న విషయాలు ఎవరికీ తెలియడం లేదు. ఏటా దోమల నివారణకు దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దోమల రెసిస్టెన్స్కి తగ్గట్టు ఫాగింగ్, రసాయనాల్లో డోస్ పెంచాల్సి ఉన్నా ఆ దిశగా జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
హైదరాబాద్, వెలుగు : సిటీ దోమ చాలా స్ట్రాంగ్ గా మారింది. ఓ రసాయనిక మందో, దోమల కాయిల్స్, ఫాగింగ్ కో అవి అదురతలేవు, బెదురుతలేవు. వాటికి రెసిస్టెన్స్ పవర్ అనేది రోజుకు రోజుకు పెరుగుతోంది. ఎలాంటి దోమల మందుకైనా అవి తట్టుకునే స్థాయిలో రూపాంతరం చెందుతున్నాయి. వీటి పవర్ ముందు ఏ మందూ పనిచేయటం లేదు. ఫ్రౌడ దశలోనే దోమలను అరికట్టటంలో విఫలమవు తుండటంతో పుట్టిన దోమలు కుట్టక మానటం లేదు. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ లో దోమల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో పారిశుధ్య నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా దోమలు శక్తి పుంజుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నగరంలో దోమలను పరిశీలిస్తే లావుగా, దృఢంగా కనిపిస్తున్నాయి. జనాల రక్తం పీల్చుతూ ఇక్కడి దోమలు పుష్టిగా మారుతున్నాయి. దోమల కాయిల్స్, ఇతర మందులకు కొత్తలో కాస్త ఫలితం ఉంటున్న ఆ తర్వాత వీటికి అవి అలవాటు పడిపోతున్నాయి. దీంతో ఎన్ని దోమల మందులు వాడినా ఫలితం ఉండటం లేదు.
దోమలకు ఆవాసాలు
చెరువుల్లో దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నగరంలో వందల సంఖ్య లో ఉన్న చెరువుల కారణంగా లార్వా దశ నుంచే దోమల సంతతి పెద్ద ఎత్తున పెరుగుతోంది. పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా జనం దోమ కాట్లకు బలవుతున్నారు. ఓపెన్ నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లటం, చిన్న వర్షాలకే గుంతల్లో నీరు నిలిచి ఉండటం, జీహెచ్ఎంసీ అధికారులు డస్ట్ బిన్ లలో చెత్తను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచకపోవటం కూడా దోమల సంఖ్య పెరిగేందుకు కారణవుతోంది.
ప్రమాదంలో ప్రజారోగ్యం
దోమల బెడద ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా కు కారణమయ్యే దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఇతర ఏ ప్రాంతాలతో పోల్చిన నగరంలోనే ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ విష జ్వరాలు ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి.
నివారణ చర్యలేవీ?
సిటీని పట్టి పీడిస్తున్న జ్వరాల సమస్యకు దోమల దండయాత్రనే ప్రధాన కారణం. వీటి నివారణలో జీహెచ్ఎంసీ అధికారులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. నిజానికి జూన్ మాసం ప్రారంభంలోనే యాంటీ లార్వా ఆపరేషన్ ప్రారంభించాలి. ఫాగింగ్, ఆయిల్ బాల్స్ తో పాటు గంబాజియా చేపలను పెంచాలి. ఏటా దోమల నివారణకు దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ దోమల మందు ఎక్కడ పిచికారి చేస్తున్నారో, ఫాగింగ్ ఏ ఏరియాలో నిర్వహిస్తున్నారో ఎవరికీ తెలియటం లేదు. గ్రేటర్ పరిధిలో డివిజన్ కు ఒక్కటి చొప్పున 150 పోర్టబుల్ ఫాగింగ్ మెషీన్లు, 13 మౌంటెడ్ ఫాగింగ్ మెషీన్లు ఉన్నాయి. పైగా దోమల రెసిస్టెన్స్ శక్తి పెరిగిన కారణంగా ఫాగింగ్, రసాయనాల్లో డోస్ పెంచాల్సిన అవసరం ఉంది.
పరిసరాల పరిశుభ్రతే కీలకం
దోమలు పరిసరాలను బట్టి రూపాంతరం చెందుతాయి. కావాల్సిన మేరకు రక్తాన్ని పీల్చి బలిష్టంగా తయారవుతాయి. అప్పుడు దోమల నివారణ మందులకు కూడా అవి అలవాటు పడుతాయి. అందువల్లే ప్రస్తుతం నగరంలో భారీగా దోమల సంఖ్య పెరిగింది. దీని నివారణకు పరిసరాల పరిశుభ్రతే కీలకం. దోమల నివారణ సరిగా చేపడితే సగం జ్వరాల బాధితుల సంఖ్య తగ్గుతుంది.
– డాక్టర్ లాలూ ప్రసాద్, ప్రభుత్వ వైద్యుల సంఘం (డీహెచ్) అధ్యక్షులు
డెంగీ
ఎడిస్ ఈజిఫ్లై అనే ఆడ దోమ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది. దీన్ని టైగర్ దోమ అని కూడా అంటారు. ఇది పగటి పూటే కుడుతుంది. డెంగీ తీవ్రమైతే చాలా ప్రమాదకరం. ఈ దోమ కుట్టడం వల్ల వారం తర్వాత ఒళ్లు నొప్పులు, తీవ్రమైన జ్వరం, దద్దుర్లు వస్తాయి. ప్లేట్లెట్లు కూడా తగ్గిపోతాయి.
చికెన్ గున్యా
ఈడిస్ దోమ కారణంగా చికెన్ గున్యా సోకుతుంది. నగరంలో ఈ కేసులు చాలా పెరిగిపోయాయి. ఒక్క గాంధీ హాస్పిటల్ లోనే ఆగస్టులో 135 కేసులు నమోదయ్యాయి. ప్రాణాపాయం లేకపోయినా ఈ జ్వరం సోకితే తీవ్రమైన ఒప్పుల నొప్పులు ఉంటాయి.
మలేరియా
ఆడ ఎనాఫిలిస్ దోమ కుడితే మలేరియా సోకుతుంది. ఇది చాలా ప్రమాదకరం. సరైన సమయంలో చికిత్స అందించకపోతే చలి, వణుకు, తీవ్రమైన జ్వరం వస్తూ పోతుంటాయి.