హైదరాబాద్, వెలుగు: ఆకలి మంటలు ఓ వైపు.. అన్నపు రాశులు మరోవైపు అంటూ ఆకలిపై ఓ కవి చెప్పిన మాటలు.. అక్షర సత్యం. అసమానతలు కలిగిన సమాజానికి సరిపోయే చక్కని వాక్యమిది. సిటీలో కొందరు పట్టెడన్నం కోసం చేయి చాచే వారుంటే.. పుట్టెడు ఆహారం వృథా చేసే జనాలు ఉన్నారు. పూట భోజనానికి రూ.5000 ఖర్చు చేసే అమీర్‌లు, రూ.5 ల భోజనంతో కడుపు నింపుకునే గరీబ్‌లను నగరంలో చూడవచ్చు. అన్నాన్ని ఆకలిని ఏకం చేసేలా జీహెచ్ఎంసీ ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ఫీడ్ ది నీడ్. అద్భుతమైన ఈ ఆలోచన ఆశించిన స్థాయిలో ఆదరణకు నోచుకోవడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అనే ధోరణితో బిజీ బిజీగా గడిపే నగర ప్రజలు ఫీడ్ ది నీడ్ ఫ్రిజ్‌లలో ఆహారం పెట్టడం లేదు. ఎక్కడో ఓ చోట కొందరు ముందుకు వస్తున్నప్పటికీ మరింత ఆదరణ, స్పందన లభించాల్సిన అవసరముంది.
వినూత్న ఆలోచన
గ్రేటర్ హైదరాబాద్‌లో నిరుపేదలకు ఆకలి తీర్చడానికి జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. సిటీలో ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా భోజనం పెట్టడానికి వివిధ ప్రాంతాల్లో ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 14న ప్రారంభించారు. దీనిపై నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులు నగరంలోని హోటల్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ప్రజలకు కూడా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఆకలితో అలమటించే వారికి ప్రేమను పంచాలని సూచించారు. సిటీలో ఆహార పదార్థాల వృధా చాలా ఎక్కువగా ఉంది. కొందరు అవసరానికి మించి ఆహారం కలిగి ఉంటారు. తినగా మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తలో పారేస్తుంటారు. గ్రేటర్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 15 శాతం వరకు ఆహార పదార్థాలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో ఆహారం వృథా కాకుండా ఇతరులకు అందించడం ద్వారా ఆహారాన్ని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో ఫీడ్ ది నీడ్ చేపట్టారు.
రూ.5లకే అన్నపూర్ణ క్యాంటీన్లు
హైదరాబాద్‌లో ఇప్పటికే 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా 40 వేలకు పైగా కేవలం రూ.5లకే భోజనం అందిస్తున్నారు. ప్రతి ఒక్క హోటల్ ఆహారం పడేయకుండా ఉండేలా, ప్రజలు కూడా ఆహార పదార్థాలను ఫీడ్ ది నీడ్ ఫ్రిజ్‌లలో పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆశించిన మేరకు స్పందన కనిపించడం లేదు. శిల్పారామం, జూబ్లీ చెక్ పోస్ట్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, లక్డీక పూల్ సహా వివిధ ప్రాంతాల్లోని పబ్లిక్ ప్లేస్‌లలో రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేశారు. యాపిల్ హోమ్ సంస్థ సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద జీహెచ్‌ఎంసీ వీటిని అందుబాటులోకి తెచ్చింది.
ఆరంభం అదుర్స్..
హైదరాబాద్‌లో ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపు నిండా భోజనం పెట్టడానికి జీహెచ్ఎంసీ చేపట్టిన ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రేమికుల దినోత్సవం నాడు నగరంలో 75వేల మందికి ఫుడ్ ప్యాకెట్‌లను ఉచితంగా అందించారు. దేశంలోనే మరే మెట్రో నగరాల్లో లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఎవరూ ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు, హోటళ్ల యజమానులతో కలిసి ఫీడ్ ద నీడ్ లో భాగంగా 30 సర్కిళ్లలో ప్రధాన కూడళ్లు, హాస్పిటళ్లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో ఉచితంగా ఫుడ్ ప్యాకెట్‌లను అందజేశారు. ఏ రోజూ ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని నిర్ణయించారు. కానీ నగరంలో ఎప్పుడు చూసినా ఫీడ్ ది నీడ్ ఫ్రిజ్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి.