టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రికి ఫైనేసిన జీహెచ్ఎంసీ

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రికి ఫైనేసిన జీహెచ్ఎంసీ

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేతలకు జీహెచ్ఎంసీ ఫైన్లు విధించింది. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో విజిలెన్స్ ఎన్‎ఫోర్స్‎మెంట్ డిపార్ట్‎మెంట్ స్పందించింది. గత కొన్ని రోజుల నుంచి సెంట్రల్ ఎన్‎ఫోర్స్‎మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైన్లను నిలిపేసిన అధికారులు.. నేటి నుంచి మళ్లీ ఫైన్లను వేయడం ప్రారంభించారు. ప్లీనరీ సందర్భంగా బంజారా‎హిల్స్ రోడ్ నెంబర్ 3లో కటౌట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‎కు జీహెచ్ఎంసీ 2 లక్షల 35 వేల జరిమానా విధించింది. అదేవిధంగా మంత్రి తలసానికి లక్ష 5 వేల రూపాయల ఫైన్ విధించింది. మంత్రి మల్లారెడ్డికి 10000 రూపాయల ఫైన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి 25 వేల రూపాయల ఫైన్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరుతో 95,000 రూపాయల జరిమానా విధించింది. శేరిలింగంపల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‎కు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయితే ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగానే స్పందించకుండా.. అంతా అయిపోయాక, తూతూ మంత్రంగా ఎన్‎ఫోర్స్‎మెంట్ డిపార్ట్‎మెంట్ చలాన్లు విధించిందని పలు విమర్శలు వస్తున్నాయి. 

టీఆర్ఎస్ ప్లీనరీ టైంలో నగరమంతా గులాబీ మయంగా మారింది. ఎక్కడ చూసిన టీఆర్ఎస్ జెండాలు, కటౌట్లు, తోరణాలతో నింపేశారు. ఇదే టైంలో సెంట్రల్ ఎన్‎ఫోర్స్‎మెంట్ సెల్.. సర్వర్ డౌన్ అయిందని అధికారులు ప్రకటించారు. కావాలనే జీహెచ్ఎంసీ ఈ విధంగా చేసిందని బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించాయి. విపక్షాలు, సామాన్య ప్రజలకు ఒక న్యాయం.. అధికార టీఆర్ఎస్‎కు ఒక న్యాయమా అంటూ మండిపడ్డారు. అయినా.. పట్టించుకోని బల్దియా ఆఫీసర్స్.. ఇప్పుడు ఫైన్ల పేరుతో డ్రామాలాడుతున్నారని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. చల్లాన్ల వసూళ్లలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

For More News..

వృద్ధులకు ఫ్రీ మీల్స్.. మిగతావారికి రూ. 5లకే ఫుల్ మీల్స్

కేసీఆర్‎కు బండి సంజయ్ డెడ్‎లైన్

సూసైడ్ అటెంప్ట్ చేసిన మిస్ తెలంగాణ