స్వచ్ఛ ఉల్లంఘనులకు GHMC జరిమానా

స్వచ్ఛ ఉల్లంఘనులకు GHMC జరిమానా

హైదరాబాద్, వెలుగుస్వచ్ఛ హైదరాబాద్  కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్న జిహెచ్ఎంసి  నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝళిపిస్తోంది. రోడ్లపై చెత్త వేయడం, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం,  రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలను వదిలివేయడం,  హోటళ్లలో  పరిశుభ్రత పాటించకపోవడం,  50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం వంటి  ఉల్లంఘనలకు  భారీగా జరిమానా  విధిస్తోంది.  స్వచ్ఛ  సర్వేక్షణ్​లో భాగంగా జనవరి నుంచి నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్న అధికారులు  ఫైన్ లు  విధిస్తున్నారు.  తరచుగా  క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

సిటీలో జనవరి నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛ ఉల్లంఘనల పై  జరిమానాలు విధించి  రూ.9  లక్షలు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  సర్కిల్ లెవెల్ లో  అధికారులు  జరిమానాల విధింపు  ప్రక్రియను కొనసాగిస్తున్నారు.   జనవరి నుంచి మొత్తం 494  మందికి రూ.8,79,500  లక్షలు  జరిమనా విధించారు.  చందానగర్ సర్కిల్ లో అత్యధికంగా 85  కేసుల్లో రూ.3,39,400  లక్షలు జరిమానా వసూలు చేశారు. శేరిలింగంపల్లి  సర్కిల్ పరిధిలో 26 కేసుల్లో  రూ.1.38  లక్షలు, ఖైరతాబాద్ సర్కిల్లో  77 కేసుల్లో రూ.77 వేలు వసూలు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్​లో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషనర్ దానకిశోర్ మెడికల్ ఆఫీసర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  స్వచ్ఛ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.   విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారుల పైన చర్యలు తీసుకోవడంతో  యంత్రాంగం  నిబంధనలు కఠినంగా అమలు చేయడం మొదలు పెట్టింది.  ఈ నేపథ్యంలో స్వచ్ఛ ఉల్లంఘనలపై జరిమానాల విధింపు నిరంతరం కొనసాగుతోంది.

జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు జోనల్,  సర్కిల్ అధికారులకు  వీక్లీ టార్గెట్లు ఇచ్చి జరిమానాలు విధించాలని సూచిస్తున్నారు.  వారానికి కనీసం పది  జరిమానాలైనా విధించాలని  చెబుతున్నారు.  ముఖ్యంగా  రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలను పడేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని తేల్చి చెబుతున్నారు.  రోడ్లపై ఉమ్మివేయడం, బహిరంగ మూత్ర విసర్జన చేయడం, నాలాల్లో చెత్త పడేయడం  ఇలా ఒక్కో ఉల్లంఘనకు రూ.100  నుంచి రూ.10,000  వరకు జరిమానాలు విధిస్తున్నారు.  ఈ ఆరు నెలల్లో విధించిన జరిమానా లలో ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగం, సర్టిఫై చేయని మాంస విక్రయాలు,  హోటల్ లలో  పరిశుభ్రత పాటించకపోవడం,  అక్రమంగా బ్యానర్లు ఏర్పాటు కేసులే ఉన్నాయి. ఈ ఘటనల నుంచి అధిక మొత్తంలో జరిమానాలు వసూలు చేసినట్టు జీహంచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.