మంజీరా మాల్కు జీహెచ్ఎంసీ జరిమానా..ఎందుకంటే

మంజీరా మాల్కు జీహెచ్ఎంసీ జరిమానా..ఎందుకంటే


షాపింగ్ మాల్స్ కొత్త దందాతో కోట్లు సంపాదిస్తున్నాయి. షాపింగ్ మాల్స్  వస్తువుల అమ్మకం కంటే..పార్కింగ్ ఫీజుల ద్వారానే ఆదాయం అర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  షాపింగ్‌మాల్స్  అక్రమ దందాలపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపిస్తోంది.  ఇందులో భాగంగా  కూకట్‌పల్లి మంజీరామాల్‌కు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. మాల్‌లో అక్రమంగా పార్కింగ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నందుకు గానూ  రూ.50 వేలు ఫైన్ వేసింది. 

మంజీరామాల్ లో అక్రమంగా పార్కింగ్ ఫీజును వసూలు చేస్తున్నారంటూ ఓ బాధితుడు సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అందులో మంజీరామాల్లో పార్కింగ్ చేసినందుకు ఇచ్చిన రిసిప్టును అప్ లోడ్ చేశాడు. దీంతో మాల్ యాజమాన్యం పార్కింగ్ రుసుమును వసూలు చేస్తున్నట్లు CEC యాప్ ధృవీకరించింది.   ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభాగం మంజీరామాల్కు రూ. 50వేల జరిమానా విధించింది. 

షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ వసూలు చేయొద్దంటూ రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ2018లో జీవో MS 63ను విడుదల చేసింది. దీని ప్రకారం షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయొద్దు. ఈ నేపథ్యంలో మంజీరా మాల్ నిబంధనలను ఉల్లంఘించి పార్కింగ్ ఫీజును వసూలు చేసినందుకు జరిమానా విధించింది.