హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో చెత్త సేకరణ, తరలింపుతో పాటు ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారడంతో జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఇండ్ల నుంచి సరిగ్గా చెత్త సేకరణ జరగడం లేదని మేయర్ మొదలు సభ్యులంతా కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్లు ఇంప్రూవ్ చేయాల్సి ఉందని బల్దియాకు ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన రివ్యూలోనూ చెత్త సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆ దిశగా ప్రయత్నాలు చేసిన బల్దియా ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ఏర్పాటు చేయబోతోంది.
జీపీఎస్ ద్వారా స్వచ్ఛ ఆటోల మానిటరింగ్
ఇంటింటికీ చెత్త సేకరించాల్సిన స్వచ్ఛ ఆటోలు చాలా ప్రాంతాల్లో రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సమయానికి రాకపోతుండడంతో చెత్తను వేయలేకపోతున్నామని, ఇంటి దగ్గర పెడితే తీసుకెళ్లడంలేదని, బయటపెడితే కుక్కలు, పిల్లలు చెల్లా చెదురు చేస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. వేరే మార్గం లేకపోవడంతో గతంలో డస్ట్బిన్లు ఉండే ప్రాంతాల్లోనే జనం చెత్త వేస్తున్నారు. చెత్త డబ్బాలు లేకపోవడంతో చెత్త రోడ్లపైకి వస్తోంది. ఇంటింటికీ చెత్త సేకరించాల్సిన స్వచ్ఛ ఆటోలు 4500 ఉన్నప్పటికీలో ఇందులో వెయ్యి వరకు ఆటోలు ఫీల్డ్ లోకి రావడంలేదు.
వచ్చిన వారు కూడా లిమిటెడ్ గా మాత్రమే చెత్తను తీసుకెళ్తామని కండిషన్స్ పెడుతున్నారు. కాస్త చెత్త ఎక్కువగా ఉంటే అదనంగా డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు జనం ఆరోపిస్తున్నారు. కొన్ని ఆటోలు గ్రేటర్ పరిధిలో కాకుండా మిగతా చోట్లనే కనిపిస్తున్నాయి. కమాండ్ సెంటర్ ఏర్పాటు తరువాత స్వచ్ఛ ఆటోలకు జీపీఎస్ సిస్టం ద్వారా ఆటో ఫీల్డ్‌లోకి ఎప్పుడు వెళ్తుందని, ఎంతమంది ఇండ్ల నుంచి సేకరణ జరుగుతుందని, ఆయా ఆటోలకు అప్పగించిన కాలనీలు కాకుండా వేరే ప్రాంతాల్లో ఏమైనా తిరుగుతున్నారా? అన్న దానిపై మానిటరింగ్ చేయనున్నారు.
లక్నో, ఇండోర్ తరహాలో..
లక్నో, ఇండోర్ తరహాలో సిటీలో చెత్త, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ పని చేయనుంది. దీంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కనెక్ట్ చేసి మహిళల భద్రతకు చర్యలు తీసుకోనున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ సెంటర్ పనిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మధ్యాహ్నమూ చెత్త తరలింపు
డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో సిటీలోని డస్ట్ బిన్లను మూడేండ్ల క్రితం బల్దియా తొలగించింది. డస్ట్ బిన్లు ఉండే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్(జీవీపీ)లను కూడా చాలా ప్రాంతాల్లో ఎత్తివేసింది. ఎవరూ రోడ్లపై చెత్త వేయొద్దని, ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోల్లో మాత్రమే వేయాలని సూచించింది. ఆటోలు చాలా ప్రాంతాల్లోకి వెళ్లకపోవడం, కొన్నిచోట్ల వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వస్తుండడంతో చాలా మంది డస్ట్ బిన్లు ఉండే జీవీపీల వద్దనే చెత్త వేస్తున్నారు.
గతంలో జీవీపీల వద్ద చెత్త వేయకుండా కాపలా కూడా పెట్టారు. తర్వాత అవేర్నెస్ కల్పించడం, జీవీపీల వద్ద ముగ్గులు వేసే కార్యక్రమాలు చేపట్టినా మార్పు రాలేదు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను బల్దియాకు చెందిన రాంకీ సంస్థ రోజూ ఉదయం, రాత్రి తొలగించేది. దీంతో మధ్యాహ్నం వేసిన చెత్త అలాగే ఉంటోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం కూడా చెత్తను తరలించాలని రాంకీని జీహెచ్ఎంసీ ఆదేశించింది. దీంతో రెండురోజులుగా జీవీపీల వద్ద మూడుసార్లు చెత్తను తీస్తున్నారు.