నోటీసులు.. సీల్​ వారెంట్లు ..GHMC​ వ్యాప్తంగా రూ.11,668 కోట్ల మొండి బకాయిలు

నోటీసులు.. సీల్​ వారెంట్లు ..GHMC​ వ్యాప్తంగా రూ.11,668 కోట్ల మొండి బకాయిలు
  • 15 ఏండ్లు చెల్లించని ప్రాపర్టీ దారులు 
  • 20 రోజుల్లో 6 లక్షల ప్రాపర్టీలకు నోటీసులు.. 60 ప్రాపర్టీలు సీల్..
  • తాజ్ బంజారా హోటల్
  •  సీల్.. ఆ వెంటనే రూ.51లక్షలు కట్టిన యాజమాన్యం

హైదరాబాద్ సిటీ, వెలుగు:ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలపై జీహెచ్ఎంసీ స్పెషల్​ఫోకస్​పెట్టింది. 15 ఏండ్లుగా ట్యాక్స్​చెల్లించని ప్రాపర్టీలను గుర్తించి నోటీసులు ఇస్తోంది. స్పందన లేకపోతే సీల్​వారెంట్లు జారీ చేస్తోంది. తాజాగా తాజ్​బంజారా హోటల్​కు అధికారులు సీల్​వేశారు. వెంటనే స్పందించిన యాజమాన్యం ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించింది. 

100 శాతం ప్రాపర్టీ ట్యాక్స్​వసూలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో సర్కిల్​స్థాయి అధికారులు ట్యాక్స్​కలెక్షన్​ను సీరియస్​గా తీసుకున్నారు. ఈ నెలలో 6 లక్షల ప్రాపర్టీలకు నోటీసులు ఇచ్చారు. 60 ప్రాపర్టీలకు సీల్ వారెంట్(తాళాలు వేసి లోపలికి అనుమతివ్వకపోవడం)లు జారీ చేశారు. గురువారం సాయంత్రం బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్​కు జీహెచ్ఎంసీ అధికారులు సీల్ వారెంట్ ఇష్యూ చేశారు. 

రూ.1.43 కోట్ల బకాయిలపై రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సీల్ చేశారు. స్పందించిన హోటల్ యాజమాన్యం శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్టీజీఎస్​ద్వారా రూ.51.50 లక్షలు చెల్లించింది. మిగతా బకాయి చెల్లింపునకు మార్చి 15 వరకు సమయం కోరింది. దీంతో హోటల్ కి వేసిన సీల్ ను అధికారులు తొలగించారు. 

15 ఏండ్లుగా పెండింగే..

15 ఏండ్లుగా జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్​కింద రూ.11,668 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో 4 వేల రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.5 వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన 600 ఆస్తుల నుంచి రూ.500 కోట్లు ఉన్నాయి. యేటా బకాయిలు పెరిగిపోతుండడంతో ఉన్నతాధికారులు ట్యాక్స్​కలెక్షన్​పై స్పెషల్​ఫోకస్​పెట్టారు. ట్యాక్స్ కలెక్షన్ కోసం రెవెన్యూ రికవరీ యాక్టు సెక్షన్269(2) ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నారు.  

ఈ నెలలో 6 లక్షల ప్రాపర్టీలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18 నుంచి సీల్ చేసి మరీ పన్ను కలెక్ట్ చేస్తున్నారు. ఇందులో 60 ప్రాపర్టీలు సీల్ చేసి ట్యాక్స్​కలెక్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాపర్టీలకు సంబంధించి ఆయా శాఖలకు జీహెచ్ఎంసీ లేఖలు రాయనున్నట్లు తెలిసింది. 

రూ.2 వేల కోట్ల వసూలే టార్గెట్

గ్రేటర్ లో 19.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో రెండున్నర లక్షల మంది కమర్షియల్ ట్యాక్స్, 17 లక్షల మంది రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 12 లక్షల 50 వేల మంది ట్యాక్స్​చెల్లించారు. రూ.1,484 కోట్ల ట్యాక్స్​వసూలైంది. బల్దియా టార్గెట్​రూ.2 వేల కోట్లు కాగా, 40 రోజుల్లో రూ.516 కోట్లు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు  తీసుకుంటున్నారు.

ఆర్థిక సంవత్సరం    పన్ను వసూళ్లు
                                      (రూ.కోట్లలో)

2023-24                            1,915  
2022-23                            1,658 
2021-22                            1,681 
2020-21                            1,633 
2019-20                            1,357