- వెంటనే చెల్లించాలంటూ ప్రాపర్టీ దారులకు మెసేజ్‌లు
- గ్రేటర్ వ్యాప్తంగా లక్ష మంది వీఎల్టీ పేయర్లు
- 100 శాతం వసూలు చేయాలని అధికారులు ప్రయత్నం
- ఏ ఒక్క ఆదాయ మార్గాన్ని వదలని బల్దియా
హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఏ ఒక్క ఆదాయ మార్గాన్ని కూడా వదలిపెట్టడం లేదు. ఖాళీ అవుతున్న ఖజానాను నింపేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక ఏడాదిలో వంద శాతం వీఎల్టీ(వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) వసూలు చేసే పనిలో పడింది. ఇండ్లకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు వసూలు చేస్తూనే, వీఎల్టీను రాబడుతోంది. గతంలో ఈ ట్యాక్స్ ను బల్దియా అధికారులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు తప్పనిసరిగా చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో ప్రాపర్టీ దారులకు మెసేజ్‌లు పంపుతున్నారు. బల్దియా యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచే వీఎల్టీ కలెక్ట్ చేస్తున్నారు. అయితే గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ట్యాక్స్ వసూలుపై ఉన్నతాధికారులు స్పెషల్ఫోకస్పెట్టారు. వీఎల్టీ కలెక్షన్‌పై వారానికోసారి కమిషనర్ ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఓపెన్ ల్యాండ్‌కు సబ్ రిజిస్ట్రార్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ నంబర్ కేటాయిస్తున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఓపెన్ ల్యాండ్ వాల్యూలో 0.5 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. గతంలో వీఎల్టీ నంబర్‌ను కేవలం డిప్యూటీ కమిషనర్ మాత్రమే కేటాయించేవారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్‌కు కూడా ఆ హక్కులు ఉన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్అయిన వెంటనే వీఎల్టీ నంబర్లు అందుతున్నాయి.
డైలీ రూ.కోటి వడ్డీ కట్టాలంటే..
జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు ఏ ఒక్క ఆదాయ మార్గాన్ని వదలడం లేదు. ఇప్పటికే వివిధ పనుల కోసం చేసిన రూ.4,590 కోట్ల అప్పులకు డైలీ రూ.కోటికి పైగా వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ నెలలో ప్రవేశపెట్టిన 2023– 24 బడ్జెట్లోనూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా కేటాయింపులు చేయలేదు. దీంతో బల్దియాను ఎలా గట్టెకక్కించాలో అధికారులకు అర్థం కావడం లేదు. కనీసం ప్రభుత్వ ఆస్తులకి సంబంధించిన బకాయిలు చెల్లించినా జీహెచ్ఎంసీ కోలుకుంటుంది. ప్రభుత్వం నుంచి రూ.5వేల కోట్లకుపైగా ప్రాపర్టీ ట్యాక్సులు రావాల్సి ఉంది.
రూ.3 కోట్ల కలెక్షన్
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం లక్ష మంది వీఎల్టీ పేయర్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 10 శాతం మంది మొన్నటి దాకా సరిగా ట్యాక్స్ కట్టేవారు కాదు.ఈ ఆర్థిక సంవత్సరంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇప్పటివరకు దాదాపు రూ.3 కోట్ల ట్యాక్స్కలెక్ట్ అయింది. దాదాపు 40 శాతం మంది ట్యాక్స్కట్టారు. 15 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా మిగిలిన 60 శాతం మంది నుంచి వీఎల్టీ కలెక్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాపర్టీ దారులకు మెసేజ్‌లు పంపుతూనే బిల్ కలెక్టర్లు ఓనర్ల వద్దకు వెళ్లి ట్యాక్స్కట్టాలని కోరుతున్నారు. అందుబాటులో లేని ఓపెన్ ల్యాండ్స్ ఓనర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు.