హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలోని పురాతన భవనాలపై జీహెచ్ఎంసీ ఫోకస్పెట్టింది. ప్రమాదకరంగా ఉన్నవాటిని వర్షా కాలానికి ముందే కూల్చివేస్తోంది. ఇందుకోసం టౌన్ప్లానింగ్విభాగం ఇప్పటికే సర్వే చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సిటీలో 459 పురాతన, శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ ఉన్నట్లు తేల్చింది. భారీ వర్షాలకు నాని కూలక ముందే చర్యలు తీసుకుంటోంది. రిపేర్లు అవసరం ఉన్న బిల్డింగ్స్ కు వెంటనే చేయించుకోవాలని యజమానులను అలర్ట్చేస్తోంది. స్పందన లేకుంటే సీజ్చేస్తోంది. జీహెచ్ఎంసీ గుర్తించిన 459 పురాతన, శిథిల భవనాల్లో బల్దియా గుర్తించింది. వీటిలో 26 భవనాలు పూర్తిగా పాడవడతో, వాటిని అధికారులు కూల్చివేశారు. మరో 40 భవనాలకు రిపేర్లు చేయాలని ఆదేశించారు. 44 ఇండ్లను ఖాళీ చేయించగా, ఒక ఇంటిని సీజ్ చేశారు. 348 ఇండ్లకు సంబంధించి త్వరలో చర్యలు తీసుకోనున్నారు. అధికారుల ఆదేశాలను పట్టించుకోని యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు.
3 వేలకి పైగా..
గడిచిన ఎనిమిదేండ్లలో జీహెచ్ఎంసీ పరిధిలో 3 వేలకు పైగా పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 500కు పైగా కూలిపోయే స్థితిలో ఉన్నాయని తేల్చి, కూల్చివేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సిటీలో 459 పురాతన భవనాలు ఉన్నట్లు గుర్తించారు. రిపేర్లు చేసుకోకపోతే కూల్చివేత నోటీసు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వర్షా కాలానికి ముందే భవనాల యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిపేర్లు చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
జోన్ల వారీగా కూల్చివేతలు
ఎల్బీనగర్ జోన్ లో 61 పురాతన భవనాలు ఉండగా, 14 భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. 14 భవనాలకు రిపేర్లు చేయించుకోవాలని యజమానులను ఆదేశించారు. 10 ఇండ్లను ఖాళీ చేయించారు. మరో 23 భవనాలపై త్వరలో చర్యలు తీసుకోనున్నారు. చార్మినార్ జోన్ లో 128 పురాతన భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలోని ఆరింటిని కూల్చివేశారు. 5 భవనాలకు రిపేర్లు చేయించుకోవాలని ఆదేశించారు. 9 ఇండ్లను ఖాళీ చేయించారు. ఒక ఇంటిని సీజ్ చేశారు. మిగిలిన107 భవనాలపై త్వరలోనే సంబంధిత చర్యలు తీసుకోనున్నారు. ఖైరతాబాద్ జోన్ లో 87 పురాతన భవనాలను గుర్తించి, 3 భవనాలను కూల్చివేశారు. 9 భవనాలకు రిపేర్లు చేయించుకోవాలని ఆదేశించారు. నాలుగు ఇండ్లను ఖాళీ చేయించగా, 71 భవనాలపై త్వరలోనే చర్యలు తీసుకోనున్నారు. సికింద్రాబాద్ జోన్ లో 108 పురాతన భవనాలను గుర్తించారు.
నాలుగు భవనాలకు రిపేర్లు చేయించాలని యజమానులను ఆదేశించారు. 4 ఇండ్లను ఖాళీ చేయించారు. మరో 100 భవనాలపై త్వరలో చర్యలు తీసుకోనున్నారు. శేరిలింగంపల్లి జోన్లో మొత్తం 34 పురాతన భవనాలు ఉన్నాయి. వీటిలో మూడు భవనాలను
ఇప్పటికే కూల్చివేశారు. నాలుగు భవనాలకు రిపేర్లు చేయాలని ఆదేశించారు. 12 ఇండ్లను ఖాళీ చేయించగా, 15 భవనాలపై చర్యలు తీసుకోనున్నారు. కూకట్ పల్లి జోన్ లో మొత్తం 40 పురాతన భవనాలను గుర్తించారు. వీటిలో నాలుగు భవనాలకు రిపేర్లు చేయాలని అధికారులు ఆదేశించారు. ఐదు ఇండ్లను ఖాళీ చేయించగా, 32 భవనాలపై త్వరలో చర్యలు తీసుకోనున్నారు.
ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు
వానాకాలం పూర్తయ్యే వరకు పురాతన భవనాల గుర్తింపు, కూల్చివేత కొనసాగుతుందని బల్దియా అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ప్రమాదకరంగా ఉన్న భవనాలపై 040-– 21111111కు కాల్చేసి ఫిర్యాదు చేయొచ్చని, అలాగే వార్డు ఆఫీసుల్లో నేరుగా ఫిర్యాదు కాపీ అందజేయొచ్చని సూచిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అంటున్నారు.