
గచ్చిబౌలి, వెలుగు: రాంకీ సంస్థ తమ పొట్టకొడుతోందని జీహెచ్ఎంసీ చెత్త సేకరణ ఆటో కార్మికులు ఆరోపించారు. సోమవారం శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. తాము సేకరించిన చెత్తను రీసైక్లింగ్ చేయట్లేదని వాపోయారు. రాంకీ సంస్థ తీరు మార్చుకోవాలని కోరారు. అదే టైంలో అక్కడికి వచ్చిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి కారును అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో 2 వేలకు పైగా చెత్త సేకరించే వాహనాలు నడుపుతున్నామని, డంపింగ్ యార్డ్ వద్ద చెత్తను రీసైకిలింగ్ చేయడం ద్వారా లభించే చిన్నపాటి మొత్తాన్ని తమకు రాకుండా రాంకీ సంస్థ అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాంకీ, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించక పోతే తమ మనుగడ కష్టమవుతుందని, కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. జోనల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.