
Hyderabad Realty: ప్రపంచ నగరాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి కంపెనీలు మహానగరానికి క్యూ కడుతున్నాయి. దీనికి అనుగుణంగా కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. రియల్టీ డెవలపర్లు మార్కెట్లకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను వేగంగా లాంచ్ చేస్తున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) నగర అవసరాలకు అనుగుణంగా వేగంగా నిర్మాణ అనుమతులను అందిస్తోంది. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరంలో సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ 102 హైరైజ్ బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడైంది. ఇదే కాలంలో జీహెచ్ఎంసీ మెుత్తంగా 13వేల 421 భవనాలు, లేఔట్లకు అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేసింది. అయితే 102లో అనుమతించబడిన ఎత్తైన భవనాల్లో 47 రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి. అలాగే మిగిలిన అనుమతి పొందిన ఎత్తైన భవన నిర్మాణాల్లో 28 కమర్షియల్, 27 హాస్పిటల్స్ సహా ఇతర నిర్మాణాలు ఉన్నట్లు తేలింది.
తెలంగాణలో చట్టప్రకారం ఎత్తైన భవనంగా దేనినైనా పరిగణించాలంటే దాని ఎత్తు నేల సాధారణ స్థాయి నుంచి 18 మీటర్లుగా ఉండాలి. వీటిలో స్టెయిర్ కేస్, లిఫ్ట్ రూములు, చిమ్నీ, ట్యాంక్స్ వంటి వాటి ఎత్తును పరిగణలోకి తీసుకోరు. కేవలం భవన నిర్మాణాన్ని మాత్రమే పరిగణిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ బిల్డింగ్ అండ్ లేఔట్ పర్మిషన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను ఇవ్వటం ద్వారా రూ.వెయ్యి 138 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందింది.
ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా రియల్టీ సంస్థలు ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో కొత్త కొత్త ఎత్తైన భవన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. ఈ ఏడాది నివాస భవనాలకు గరిష్ట ఎత్తు కొండాపూర్, శేరిలింగంపల్లి మండలంలోని నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతించింది. ఇది 4-సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 49 పై అంతస్తులకు అనుమతి ఇవ్వబడ్డాయి.